కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్: ఎవరు వేశారంటే?
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై శనివారం నాంపల్లి స్పెషల్ కోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి కేటీఆర్‌పై క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ సృజన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేలా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారటూ ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. కేటీఆర్ ఆరోపణలు చేస్తున్న శోధ కన్‌స్ట్రక్చన్ 2011లో ప్రారంభమైందని.. ఆ కంపెనీ ఎండీగా కందాల దీప్తి రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆ సంస్థలో తనకు ఎలాంటి షేర్లు లేవని స్పష్టం చేశారు సృజన్ రెడ్డి. శోధ కన్‌స్ట్రక్చన్స్‌తో తనను లింక్ చేస్తూ కేటీఆర్ అందర్నీ తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు.

అమృత్ 2లో ప్యాకేజీ 1 కింద ఏఎంఆర్-శోధ-ఐహెచ్‌పీ జాయింట్ వెంచర్‌లో కేటీఆర్ చెబుతున్నట్లు శోధకు 80 శాతం కాకుండా 29 శాతమే వాటా ఉందని సృజన్ రెడ్డి తెలిపారు. అమృత్ పనులకు ఈ-టెండర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో టెండర్లు నిర్వహించారని, పారదర్శకమైన విధానంలోనే టెండర్ల కేటాయింపు జరిగినా కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
మాజీ మంత్రిగా కేటీఆర్‌కు టెండర్ల విధానంపై స్పష్టమైన అవగాహన ఉందన్న సృజన్ రెడ్డి.. అయినప్పటికీ తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఆయన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మార్చుకోకపోవడంతోనే తాజాగా క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశానని సృజన్ రెడ్డి వివరించారు. కాగా, సృజన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నాంపల్లి స్పెషల్ కోర్టు వచ్చే సోమవారం రోజున విచారించనుంది. ఆయన స్టేట్ మెంట్ నమోదు చేయనుంది.
గతంలో కేటీఆర్ ఆరోపణలు చేయడంతో సృజన్ రెడ్డి లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. అయితే, తాను లీగల్ నోటీసులకు భయపడబోనని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి, అక్రమాలపై తన పోరాటం కొనసాగిస్తానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications