కాకతీయుల కాలంనాటి భద్రకాళి చెరువులో నక్షత్ర వనాలు, ఐల్యాండ్స్.. కానీ కొత్త ఆందోళన!
చారిత్రక ఓరుగల్లులోని భద్రకాళీ చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే భద్రకాళీ చెరువులో మట్టి పూడిక తీసి చెరువులో నీటి సామర్థ్యాన్ని పెంచుతారని అందరూ భావించారు. అయితే తాజాగా ప్రభుత్వం సుందరీకరణ పేరుతో భద్రకాళి చెరువులో ఐలాండ్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం భద్రకాళి ఆలయానికి వచ్చే భక్తులకు సంతోషం కలిగిస్తున్నది. కానీ సామాజిక కార్యకర్తలకు మాత్రం ఆందోళన కలిగిస్తుంది.
భద్రకాళి చెరువులో నక్షత్ర వనాలు, ఐల్యాండ్స్
ఓరుగల్లులోని కాకతీయుల కాలంనాటి భద్రకాళి చెరువులో, చెరువు మధ్యలో నక్షత్ర వనాలు, పక్షుల నివాసాలు, ఐలాండ్స్ ఏర్పాటు చేయడానికి తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అధికారుల పర్యవేక్షణలో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. చెరువులో పూడిక తీసిన మట్టిని ఐదు చోట్ల పెద్ద కుప్పలుగా పోసి వాటిని ఐలాండ్స్ గా అభివృద్ధి చేయాలని చూస్తున్నారు.

బోటు షికారుకు ప్రణాళికలు
భద్రకాళీ దేవాలయానికి వచ్చే భక్తులు బోటు ద్వారా నక్షత్ర వనాలు, ఐలాండ్ ల వద్దకు వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వరంగల్ పోతన రోడ్, హంటర్ రోడ్, హన్మకొండ పద్మాక్షి గుట్ట రోడ్, ఆంజనేయ స్వామి ఆలయం, భద్రకాళి ఆలయం వైపు మొత్తం ఐదు చోట్ల మట్టి కుప్పలు పోసి ఐలాండ్స్ మాదిరిగా ఏర్పాట్లు చేయనున్నారు. జన్మ నక్షత్రాల మొక్కలు, పక్షులను ఆకర్షించే మొక్కలు వాటిలో పెంచనున్నారు.
భద్రకాళి చెరువు ఉనికికే ప్రమాదం
అయితే ఈ నిర్ణయంతో చెరువు విస్తీర్ణం తగ్గిపోతుందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హంటర్ రోడ్డు, పద్మాక్షిగుట్ట, పోతన రోడ్డు, ఎన్టీఆర్ నగర్ వైపు భద్రకాళి బండ్ ఏర్పాటుచేసి చెరువు విస్తీర్ణాన్ని తగ్గించారు. ఇప్పుడు మళ్లీ భద్రకాళి చెరువు లోపల నక్షత్ర వనాలను, ఐలాండ్స్ ను ఏర్పాటు చేసి కాకతీయుల కాలంనాటి గొలుసుకట్టు చెరువైన భద్రకాళి ఉనికినే ప్రమాదంలో పడేస్తున్నారని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెరువు విస్తీర్ణం తగ్గే ప్రమాదం
భద్రకాళి దేవాలయం చుట్టూ మాడవీధులు, చెరువు మధ్యలో నక్షత్ర వనాలు, ఐలాండ్ పనులు చేయిస్తున్న నేపధ్యంలో సుమారు 30 నుండి 40 ఎకరాల విస్తీర్ణం చెరువు తగ్గిపోతుంది. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చెరువు విస్తీర్ణం తగ్గితే గ్రేటర్ వరంగల్ ముంపు బారిన పడే ప్రమాదం ఉందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ కు ముంపు ముప్పు
ఇప్పటికే గత 15 సంవత్సరాలుగా బొంది వాగు నాలా వరద ధాటికి భద్రకాళి చెరువు పరిసరాల్లోని 15 నుంచి 20 కాలనీలు నీట మునుగుతున్నాయి. ఇప్పుడు భద్రకాళి చెరువును కుదింపు చేస్తే ఆ ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉందని ఇక ఇదే విషయాన్ని నీటిపారుదల, గ్రేటర్ వరంగల్ అధికారులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రకాళీ చెరువు సుందరీకరణ కు సంబంధించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా? లేదా? అన్నది ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications