అసెంబ్లీ ఎన్నికల వేళ కలకలం: కేటీఆర్‌కు థ్రెట్ నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

ప్రచారం ముమ్మరంగా కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు అటాకర్స్ నోటిఫికేషన్ అందింది. ఆయన వినియోగించే యాపిల్ ఫోన్‌కు ఈ నోటిఫికేషన్ వచ్చింది. యాపిల్ మొబైల్ ఫోన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు సైబర్ దాడికి పాల్పడినట్లు తెలియజేసే నోటిఫికేషన్ అది.
ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా వెల్లడించారు. తన మొబైల్ ఫోన్‌ను స్టేట్- స్పాన్సర్డ్ అటాకర్స్ టార్గెట్ చేశారని వివరించారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. సైబర్ దాడులు, ప్రతిపక్ష నేతలపై నిఘా ఉంచడం, వారి ఫోన్లపై స్పైవేర్‌తో హ్యాకింగ్ చేయడం.. వంటి అసాంఘిక కార్యకలాపాలు బీజేపీ ప్రభుత్వంలో కొత్తేమీ కాదని, ఇందులో ఆశ్యర్యమేమీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుల్లో ఇలాంటి థ్రెట్ నోటిఫికేషన్ అందుకున్న వారిలో కేసీఆర్ మూడో వ్యక్తి. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికీ ఇలాంటి మెసేజీలు అందాయి.
Received a message from Apple that state-sponsored attackers are targeting my phone
— KTR (@KTRBRS) October 31, 2023
It’s of course not at all a surprise as we know BJP can stoop to any lows to attack the opposition leaders pic.twitter.com/7nadb2BYEo
దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు ఎంపీలకూ ఇలాంటి సందేశాలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ ఛద్దా తదితరులు ఉన్నారు. ది వైర్ వ్యవస్థాపకుడు సిద్ధార్థ్ వరదరాజన్, డెక్కన్ క్రానికల్ రెసిడెంట్ ఎడిటర్ శ్రీరామ్ కర్రీ, ఇండిపెండెంట్ జర్నలిస్టు రేవతి ఉన్నారు.












Click it and Unblock the Notifications