మరో దారుణం: బాలికకు గరిటెతో మారుతండ్రి వాతలు
హైదరాబాద్: తల్లిదండ్రులు చేతిలో చిత్రహింసల పాలైన సంఘటనను మరిచిపోక ముందే రంగారెడ్డి జిల్లాలో అటువంటి సంఘటనే మరోటి జరిగింది. మారు తండ్రి నాలుగేండ్ల బాలికను చిత్రహింసలు పెడుతున్న సంఘటన గురువారం వెలుగుచూసింది.
మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామానికి చెందిన శాంతమ్మకు కూతురు, కుమారుడు ఉన్నారు. పదేళ్లుగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం జవహర్‌లోని బీజేఆర్‌నగర్‌లో నివాసముంటున్నారు. శాంతమ్మ కూతురు ప్రమీల వెంకట్‌రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు అమ్మాయిలున్నారు.

పెద్దమ్మాయి పవిత్ర స్థానిక ప్రైవేట్ పాఠశాలలో 5వ తరగతి చదువుతుండగా చిన్న కూతురు సంధ్య ఎల్‌కేజీ చదువుతున్నది. మూడేండ్లక్రితం వెంకట్‌రెడ్డి గుండెపోటుతో మరణించాడు. అప్పటినుంచి కూతుళ్లతో కలిసి తల్లి శాంతమ్మ వద్ద ప్రమీల ఉంటున్నది. ఈక్రమంలో మూడు నెలల క్రితం అల్వాల్‌కు చెందిన ప్రశాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి ప్రశాంత్ చిన్న కూతురు సంధ్యను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు.
గంటెతో వీపులు, చేతులపై కాలుస్తూ, చిన్నపిల్ల అని చూడకుండా కర్రతో కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దీంతో ఆ చిన్నారి నడవలేని స్థితికి చేరుకుంది. ఈ ఘాతుకాలపై అమ్మమ్మ శాంతమ్మ, మామ శ్రీనివాస్ పలుమార్లు ప్రశాంత్‌ను హెచ్చరించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications