సింగరేణిలో సమ్మె సైరన్: ఈనెల 28,29తేదీల్లో రెండురోజుల సమ్మె; కార్మిక సంఘాలు సిద్ధం!!
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణిలో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 28,29 తేదీలలో సార్వత్రిక సమ్మెను నిర్వహించాలని భావించిన కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈమేరకు సింగరేణి యాజమాన్యానికి కూడా కార్మిక సంఘాలు సమ్మె నోటీసును అందజేశాయి.

సమ్మె నోటీస్ ఇచ్చిన సింగరేణి కార్మిక సంఘాలు
తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన సింగరేణిలోని కొన్ని బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు సమ్మె చేపట్టనున్నారు. మార్చి 28, 29 తేదీల్లో సమ్మెను చేపడతామని ఏఐటియుసి, హెచ్ఎంఎస్, ఐఎన్టియుసి తదితర కార్మిక సంఘాలు సంస్థకు సమ్మె నోటీసులను అందజేశాయి. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రధాన డిమాండ్ తో సింగరేణి కార్మిక సంఘాలు సమ్మెకు వెళుతున్నాయి.

ఇప్పటికే అనేకమార్లు ఆందోళన, మళ్ళీ రెండు రోజుల పాటు సమ్మె సైరన్
తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణ పల్లి బ్లాక్, కొయ్యలగూడెం బ్లాక్, కల్యాణఖని బ్లాక్ 6లను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు సమ్మెకు వెళుతున్నాయి. ఇప్పటికే ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేసిన కార్మిక సంఘాలు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ సింగరేణిలో కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన 72 గంటల సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే.
అంతేకాదు గత ఏడాది డిసెంబర్లో కూడా సింగరేణి కార్మికులు డిసెంబర్ 9 నుంచి మూడు రోజుల పాటు సమ్మె నిర్వహించి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇక తాజాగా 28, 29 తేదీలలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సమ్మె నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా 88బొగ్గు బ్లాకుల వేలం.. తెలంగాణాలో వేలానికి ఈ బ్లాకులు
దేశవ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకుల వేలం పై కేంద్రం ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే.ముఖ్యంగా తెలంగాణాకు ఈ ప్రకటన షాక్ ఇచ్చింది. కేంద్రం ప్రకటించిన బొగ్గు బ్లాకుల వేలంలో ఇప్పటికే సింగరేణి బొగ్గు లభ్యతపై అన్వేషణ సాగిస్తున్న తెలంగాణా బ్లాకులుకూడా ఉండటం కార్మికుల ఆందోళనలకు, తెలంగాణ ప్రభుత్వ వ్యతిరేకత కు కారణమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం బ్లాక్ 3,ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్ 3,మంచిర్యాల జిల్లా కళ్యాణఖనిబ్లాక్ 6,శ్రావణ పల్లి లోని ఓ బ్లాక్ లను వేలం వేయడానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో సింగరేణి కార్మికుల ఆగ్రహజ్వాలలకు కారణంగా మారింది.

తెలంగాణా బడ్జెట్ సమావేశాల్లోనూ బొగ్గు గనుల ప్రైవేటీకరణపై చర్చ, అధికార టీఆర్ఎస్ ఫైర్
ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాలలోనూ సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై చర్చ జరిగింది. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను అధికార టీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తుంది. అవసరమైతే సింగరేణి బొగ్గు గనుల కోసం తెలంగాణ రాష్ట్రంలో మరో పోరాటానికి శ్రీకారం చుట్టామని అధికార టీఆర్ఎస్ తేల్చి చెబుతోంది. బొగ్గు గనులు ప్రైవేటు పరం చేయడానికి వీల్లేదని తేల్చి చెబుతోంది. సింగరేణి ప్రైవేటీకరణ చేస్తే కేంద్రంతో సమరమే అంటుంది తెలంగాణ ప్రభుత్వం.












Click it and Unblock the Notifications