హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం
హైదరాబాద్ నగరంలోని మియాపూర్ పరిధిలో ఉన్న హఫీజ్‌పేట్ ప్రాంతంలో ఒక సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. జుట్టు ఎక్కువగా ఉందని కారణంగా ఒక స్కూల్ ప్రిన్సిపాల్ విద్యార్థికి బలవంతంగా గుండు కొట్టించిన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో స్కూల్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా..
హఫీజ్‌పేట్‌లోని ప్రేమ్ నగర్ బీ-బ్లాక్‌లో ఉన్న బ్లాక్ బోర్డు ది స్కూల్లో ఈశ్వర్ అనే విద్యార్థి తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల అతని జుట్టు కొంచెం ఎక్కువగా ఉండటాన్ని గమనించిన స్కూల్ ప్రిన్సిపాల్ వెంటనే జుట్టు కత్తిరించుకోవాలని సూచించినట్లు సమాచారం. అయితే ఆ విద్యార్థి తనకు దేవుడికి మొక్కు ఉందని, కొంతకాలం వరకు జుట్టు కత్తిరించుకోలేనని ప్రిన్సిపాల్‌కు తెలిపినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. కానీ మరుసటి రోజు స్కూల్‌కు వచ్చిన ఈశ్వర్‌కు ప్రిన్సిపాల్ బలవంతంగా గుండు కొట్టించాడని ఆరోపిస్తున్నారు.

లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కు..
ఈశ్వర్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తాము లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కు పెట్టుకున్నామని.. అందుకే కొంతకాలం జుట్టు కత్తిరించకూడదని ప్రిన్సిపాల్‌కు ముందుగానే తమ కుమారుడు చెప్పాడని పేర్కొన్నారు. అయినప్పటికీ స్కూల్ యాజమాన్యం ఆ విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థి తీవ్రంగా మనస్తాపానికి గురయ్యాడని చెబుతున్నారు. స్కూల్ యాజమాన్యం విద్యార్థి భావోద్వేగాలను, కుటుంబ విశ్వాసాలను గౌరవించకుండా వ్యవహరించిందని వారు విమర్శించారు.
స్కూల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన..
ఈ విషయం తెలుసుకున్న వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. తమ కుమారుడికి మొక్కు ఉండగా ఇలా బలవంతంగా గుండు కొట్టించడం తగదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ యాజమాన్యం తమకు ముందుగా సమాచారం ఇవ్వకుండా ఈ చర్య తీసుకుందని ఆరోపించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు సంబంధిత విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థుల వ్యక్తిగత విశ్వాసాలు, భావోద్వేగాలను గౌరవించడం విద్యాసంస్థల బాధ్యత అని వారు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై స్థానికంగా కూడా చర్చ జరుగుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా విద్యాశాఖ లేదా స్థానిక అధికారులు విచారణ చేపట్టే అవకాశముందని సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications