తలారి సత్యం మృతి: ఆ వాహనం.. ఎమ్మెల్యే జీవన్ వైపు టిడిపి వేలు
నిజామాబాద్: తనకు ప్రాణహానీ ఉందని ఇటీవల ప్రమాదంలో మృతిచెందిన తలారి సత్యం హెచ్చార్సీని ఆశ్రయించారని, దీనికి టిఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేత రాజారామ్ యాదవ్ గురువారం నాడు ప్రశ్నించారు.
సత్యం తండ్రి ఫిర్యాదును పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. తలారి సత్యం మృతికి కారణమైన టిప్పర్ జీవన్ రెడ్డి సోదరుడిది కాదా అని ఆయన ప్రశ్నించారు. సత్యం హత్య కోసమే మహారాష్ట్ర నుంచి డ్రైవర్‌ను తీసుకు వచ్చారని ఆరోపించారు. సత్యం హత్య పైన సిబిఐతో విచారణ జరపాలన్నారు.
కాగా, తలారి సత్యం గత సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి సిపిఐఎంల్ న్యూడెమోక్రసీ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తలారి సత్యం మృతి వెనుక ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి.

రెండు రోజుల క్రితం తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. తలారి సత్యం హత్య వెనుక జీవన్ రెడ్డి ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా జీవన్ రెడ్డి వైపు వేలెత్తి చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గురువారం నాడు జీవన్ రెడ్డి స్పందించారు. ప్రమాదంలో మృతి చెందిన తలారి సత్యం మృతితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఈ రోజు అన్నారు. దీనిపై తాను సిబిఐ విచారణకు సిద్ధమని చెప్పారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేసే రేవంత్ రెడ్డికి వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications