రిజైన్ చేయించు, నేనూ చేస్తా, నీతి అని మాట్లాడకు: బాబుకు తలసాని సవాల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం సవాల్ విసిరారు. 2014లో వైసిపి నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరిన నలుగురికి మంత్రి పదవులు ఇచ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం సవాల్ విసిరారు. 2014లో వైసిపి నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారని, వారితో రాజీనామా చేయిస్తే, తాను రాజీనామా చేస్తానని సవాల్ చేశారు.
ఏపీ కేబినెట్ విస్తరణ ఆదివారం ఉదయం జరిగింది. మొత్తం 11 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో నలుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారు.

అఖిలప్రియ సహా నలుగురికి కేబినెట్లో చోటు.. తలసాని ప్రశ్న
అఖిల ప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులు 2014లో వైసిపి నుంచి గెలిచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మంత్రి పదవులు దక్కాయి. దీనిపై తలసాని చంద్రబాబుకు సవాల్ చేశారు.

చంద్రబాబూ! సమాధానం చెప్పు
వేరే పార్టీ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవి ఇవ్వడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. గతంలో తాను టిడిపి నుంచి గెలిచి, తెరాసలో చేరి మంత్రి పదవి తీసుకుంటే టిడిపి నేతలు ప్రశ్నించడాన్ని ఆయన గుర్తు చేశారు.

గవర్నర్ తీరును తప్పుబట్టావుగా..
ఇప్పుడు చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గతంలో తమతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ నిర్ణయాన్ని కూడా చంద్రబాబు తప్పుబట్టారని చెప్పారు. ఇప్పుడు వేరే పార్టీ వాళ్లను మంత్రులుగా అదే గవర్నర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారన్నారు.

నీతి, నిజాయితీ అనే పదాలు ఉపయోగించకు
మాకు మంత్రి పదవులు ఇవ్వవద్దని ఢిల్లీ దాకా కాళ్లు అరిగేదాకా తిరిగారని తలసాని మండిపడ్డారు. నిజాయితీ, నిప్పు అనే పదాలు ఇక నుంచి చంద్రబాబు ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications