'టీ' సర్కార్ హరితహారం: మొక్కను నాటి నీరు పోసిన రేవంత్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై నిత్యం విమర్శలు గుప్పిస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపనేత రేవంత్ రెడ్డి గురువారం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో పాల్గొన్నారు.
ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇటీవలే నెల రోజుల పాటు చర్లపల్లి జైలులో ఉండి బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్రభుత్వం తనని ఉద్దేశ పూర్వకంగా ఓటుకు నోటు కేసులో ఇరికించిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి బెయిల్ లభించిన తర్వాత తన సొంత నియోజక వర్గం కొడంగల్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే.

సొంత నియోగకవర్గంలో ఉన్న రేవంత్ రెడ్డి గురువారం హరితహారంలో పాలు పంచుకున్నారు. ఈ విషయం అటు సొంత పార్టీ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. అంతే కాదు హరితహారంలో భాగంగా ఆయన కొడంగల్‌లో ఓ మొక్కను నాటి నీరు పోశారు.
అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. మరోవైపు ఓటుకు నోటు కేసులో అరెస్టయి బెయిల్ మీద విడుదలైన రేవంత్‌ను పరామర్శించడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటి వద్దకు వస్తున్నారు. గురువారం రాత్రి టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణతో పాటు పలువురు నాయకులు రేవంత్ రెడ్డిని కలిశారు.
తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆకుపచ్చ తెలంగాణ కోసం చేపట్టిన ఈ హరితహారం పథకాన్ని సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ఈ నెల 3న ప్రారంభించారు. అనంతరం బాలాజీ వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సియల్ హాస్టల్‌లో మొక్కలు నాటారు.












Click it and Unblock the Notifications