చందానగర్ లాడ్జీలో యువతిది హత్యే: ఏమి ఎరగనట్లుగా ప్రియుడు ఆస్పత్రిలో, విచారణలో తేలింది
హైదరాబాద్: నెల రోజుల క్రితం చందానగర్‌లోని ఓ లాడ్జీలో అనుమానాస్పాద స్థితిలో మృతి చెందిన ప్రకాశం జిల్లాకు చెందిన యువతి నాగచైతన్య(24)ది హత్యగా పోలీసుల అనుమానిస్తున్నారు. లాడ్జీలో యువతితో ఉన్న కోటిరెడ్డి.. ఆ తర్వాత గదికి తాళం వేసి వెళ్లాడని, అనంతరం తన ఒంటిపై గాయాలు చేసుకుని ఒంగోలు ఆస్పత్రిలో చేరినట్లు అనుమానిస్తున్నారు.

పెళ్లి ఇష్టంలేకనే ప్రియుడే దారుణానికి..
ఈ నేపథ్యంలో కోటిరెడ్డే హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నాగచైతన్యను కోటిరెడ్డి నమ్మించి దారుణంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఇష్టంలేకే దారుణానికి ఒడిగట్టాడని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఘటనపై హత్య కేసుగా నమోదు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చందానగర్ సీఐ క్ాయస్ట్రో తెలిపారు.

లాడ్జీలో గది తీసుకుని ఇద్దరు అక్కడే..
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కరవాడి ప్రాంతానికి చెందిన శ్రీనివాసరావు కుమార్తె నాగచైతన్య.. హైదరాబాద్‌లోని చందానగర్ నల్లగండ్ల సిటిజన్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తోంది. యువతి తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. సవతి తల్లి మాత్రం ఉంది. కాగా, గుంటూరు జిల్లా రెంట చింతల ప్రాంతానికి చెందిన గాదె కోటిరెడ్డి మెడికల్ రిప్రజంటెటీవ్‌గా పనిచేస్తున్నాడు. తరచూ అతడు ఈ ఆస్పత్రికి వెళ్లే క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది. కాగా, వీరి సామాజికి వర్గాలు వేరు కావడంతో యువకుడి కుటుంబీకులు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 23న ఆస్పత్రి ఎదురు ప్రాంతంలోని ఓ లాడ్జీలో గది తీసుకుని, అక్కడే కలిసి వున్నారు. ఆ తర్వాతి రోజు ఆదివారం రాత్రి వీరు తీసుకున్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి లాడ్జి సిబ్బంది పరిశీలించడంతో గొంతుకోసి రక్తపు మడుగులో నాగచైతన్య విగతజీవిగా పడివుంది.

ప్రియురాలిని హతమార్చి.. ప్రియుడు ఏపీకి పరారీ..
లాడ్జీ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకున్నారు. కాగా, కోటిరెడ్డి కూడా పొట్ట, గొంతు దగ్గర కత్తి గాట్లతో ఒంగోలు వెళ్లి ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆమె గొంతు కోసుకుందని, భయంతో తాను వచ్చేశానని కోటిరెడ్డి చెప్పినట్లు తెలిసింది. ఇక లాడ్జీ గదిని పరిశీలించగా గదిలో మద్యం సీసాలుండటం, రక్తం మడుగును కడిగేందుకు ప్రయత్నించినట్లు ఆనవాళ్లుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే యువతి నాగచైతన్యను కోటిరెడ్డే హత్య చేసి తనకు సంబంధం లేనట్లుగా నాటకం ఆడినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications