తెలంగాణను పాకిస్తాన్ లా విడదీశారు..! లోక్ సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ షాకింగ్..!
లోక్ సభతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్ల పెంపు కోసం కేంద్రం ఇవాళ లోక్ సభలో నియోజకవర్గాల పునర్విభజన (delimitation 2026) బిల్లును ప్రవేశపెట్టింది. దక్షిణాది రాష్ట్రాలకు ఈ బిల్లుతో అన్యాయం జరుగుతుందన్న ఆందోళనల్ని లోక్ సభలో జరిగిన చర్చలో తోసిపుచ్చిన కేంద్రం.. ఎవరికీ అన్యాయం జరగదని హామీ ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి సమయంలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య (Tejasvi surya) తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీని తిట్టే క్రమంలో ఆయన తెలంగాణ ప్రస్తావన తెచ్చారు. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను విడతీసిన తీరు దారుణంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో భారత్ నుంచి పాకిస్తాన్ ను ఎలా అశాస్త్రీయంగా విడతీశారో అలాగే తెలంగాణను కూడా విడదీశారని కాంగ్రెస్ పార్టీపై తేజస్వీ సూర్య వ్యాఖ్యలు చేశారు. ఈ విభజనలో కనీస శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదన్నారు. కాబట్టి బ్రిటిష్ వారు చేసిన దేశ విభజన కంటే కాంగ్రెస్ చేసిన ఏపీ విభజన దారుణంగా ఉందన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాల్ని, భవిష్యత్తును రాష్ట్ర విభజన సందర్బంగా అస్సలు పట్టించుకోలేదని తేజస్వీ సూర్య ఆరోపించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేశారని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. అయితే అప్పట్లో ఈ విభజనకు పార్లమెంట్లో బీజేపీ కూడా మద్దతిచ్చిన విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించకపోవడం విశేషం. అయినా తెలంగాణ విభజన జరిగి 12 ఏళ్లు దాటిపోతున్నా ఇంకా బీజేపీ ఎంపీ తేజశ్వీ సూర్య కాంగ్రెస్ పార్టీని విమర్శించే క్రమంలో పాకిస్తాన్ తో పోల్చి చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.














Click it and Unblock the Notifications