మరో పోరు?: 'లంబాడా'లతో అమీతుమీకి ఆదివాసీలు, సహాయ నిరాకరణకు పిలుపు!
ఆదిలాబాద్: లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని గత కొంతకాలంగా ఆదివాసీలు ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో వారు మరో పోరుకు సిద్దమయ్యారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఆదివాసీలు లంబాడా అధికారుల పట్ల సహాయ నిరాకరణ ఉద్యమానికి సిద్దమవుతున్నారు.
ఈ మేరకు మే 31వ తేదీ అర్థరాత్రి ఆదివాసీలు తుడుం దెబ్బ మోగించి తమ నిరసన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మా గూడేలను మేమే పాలించుకుంటామన్న నినాదంతో వారు ఉద్యమాన్ని సాగించనున్నారు. జూన్ 1వ తేదీ నుంచి పాత ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆదివాసీలు లంబాడా అధికారుల పట్ల సహాయ నిరాకరణ కొనసాగుతుందని చెబుతున్నారు.

అంతేకాదు, జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా నల్లజెండాలతో నిరసనలుతెలపనున్నారు. లంబాడాలు తమ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపిస్తున్న ఆదివాసీలు.. అవే భూముల్లో నల్లజెండాలు పాతి నిరసన తెలపనున్నారు. లంబాడా అధికారులను గ్రామాల్లోకి అడుగుపెట్టనివ్వమని చెబుతున్నారు.
ఆదివాసీ హక్కుల పోరాట సమితి(తుడుం దెబ్బ) అధ్యక్షుడు సోయెం బాపూరావు మాట్లాడుతూ.. లంబాడా ఉద్యోగులు ఆదివాసీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. లంబాడా టీచర్లు స్కూళ్లలో ఆదివాసీల పిల్లలకు చదువు చెప్పడం లేదని, వారి పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications