తెలంగాణలో కాంగ్రెస్ బిగ్ ప్లాన్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly elections) వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అక్టోబర్ 10వ తేదీ లోపే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది. 7 లేదా 8వ తేదీల్లో షెడ్యూల్ విడుదల అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. సరిగ్గా నెల రోజుల తరువాత పోలింగ్ ఉండొచ్చనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అధికార భారత్ రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi) కసరత్తు పూర్తి చేస్తోంది. ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించింది. షెడ్యూల్ విడుదల కావడానికి ఎంతో సమయం లేకపోవడం వల్ల అభివృద్ధి ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ముమ్మరం చేసింది.

అటు కాంగ్రెస్ (Congress), భారతీయ జనతా పార్టీ (BJP) ఈ సమరానికి రెడీ అయ్యాయి. బీఆర్ఎస్ (BRS) నుంచి వలస వచ్చిన నాయకుల చేరికతో కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao), మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం (Vemula Veeresham) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ పరిణామాల మధ్య తాజాగా అసెంబ్లీ ఎన్నికల సర్వే నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. లోక్‌పోల్ నిర్వహించిన సర్వే అది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేత ఎవరనేది అంచనా వేసిందా సంస్థ. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా వాటి ఫలితాలను విడుదల చేసింది. ఓ లోక్‌సభ పరిధిలో ఉండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని వస్తాయనేది తెలియజేసింది.
ఈ రిపోర్ట్ బట్టి చూస్తే- ఈ దఫా తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్- 61 నుంచి 67 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఈ సర్వేలో తేలింది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 41 నుంచి 44 వరకు ఓట్ల శాతాన్ని నమోదు చేసుకుంటుంది ఈ సర్వే నివేదికను బట్టి చూస్తే.
ఈ సర్వే- తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో జోష్ పెంచింది. బస్సు యాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించబోతోన్నారు ఆ పార్టీ నాయకులు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోన్నారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించేలా రోడ్ మ్యాప్‌ను రూపొందించారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క సహా దాదాపుగా తెలంగాణ కాంగ్రెస్ అగ్రస్థాయి నాయకులందరూ ఇందులో పాల్గొననున్నారు. బస్సు యాత్ర ద్వారా ప్రతి గ్రామాన్నీ పలకించనున్నారు. ఈ నెల 16వ తేదీన రాహుల్ గాంధీ జెండా ఊపి ఈ బస్సు యాత్రను ప్రారంభించే అవకాశం ఉంది.
ఉత్తర తెలంగాణలో జరిగే బస్సు యాత్రలో పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఈ నెల 19, 20, 21వ తేదీల్లో బస్సు యాత్రలో ఆయన పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైనట్లు చెబుతున్నారు. అంతకంటే ముందే- అభ్యర్థుల ప్రకటన ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications