2023లోనే ఎన్నికల నగారా.. తెలంగాణలో కేంద్ర ఎన్నికల బృందం వరుస సమావేశాలు!!
భారత ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ఈ రోజు నుంచీ మూడు రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల సంసిద్ధతపై ఈ బృందం విస్తృతంగా సమాలోచనలు చేస్తుంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలో హైదరాబాద్ కు చేరుకున్న బృందంలో పలువురు డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు, అండర్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులతో పాటూ, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాలపరిమితి త్వరలో ముగియనుండటంతో రాష్ట్రంలో ఎన్నికల సంసిద్ధత, శాంతి భద్రతలపై ఈ బృందం విస్తృతంగా చర్చించనుంది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర ముఖ్య అధికారులతో చర్చించనున్నారు.

కాగా రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంటులు, ఇతర ముఖ్య అధికారులతో ఎన్నికల కమిషన్ బృందం సమావేశం అవుతుంది. అయితే తెలంగాణలో 2023 లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ సంవత్సరం నవంబర్ లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటం తెలుస్తోంది.
తెలంగాణ సాధారణ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ఎన్నికల కమిషన్ ఈ మేరకు వరుసగా అధికారులకు ట్రైనింగ్ ఇస్తూ వస్తోంది. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే రాష్ట్రస్థాయి అధికారులకు శిక్షణ ఇచ్చింది. ఈనెల 5వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఎన్నికల కమిషన్ మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ ఇచ్చింది.
ఓటర్ల నమోదు మొదలుకొని పోలింగ్, ఓట్ల లెక్కింపు వరకు ఎన్నికల ప్రాసెస్ పై శిక్షణ ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో మూడు సంవత్సరాలు ఒకే చోట పనిచేస్తున్న అధికారుల బదిలీలపై కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. జులై 31వ తేదీ లోపు ఈ బదిలీల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లుగా సమాచారం. ఇక ఆపై నవంబర్లో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసి 2023లో ఎన్నికలు నిర్వహించాలని ఎలక్షన్ కమిషన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications