బిగ్ షాక్: కేసీఆర్ సైతం వెనుకంజ: కంచుకోటకు ఈటెల పోటు
Telangana Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. సరిగ్గా ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అదే దూకుడును ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కొనసాగించింది హస్తం పార్టీ. తొలి గంటలోనే పూర్తిస్థాయి మెజారిటీని సాధించింది.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 60. ఈ మార్క్‌ను అలవోకగా అందుకుంది కాంగ్రెస్. తొలి రౌండ్ నుంచే ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు. పోస్టల్ బ్యాలెట్లలో సాధించిన పైచేయిని ఈవీఎం లెక్కింపుల్లోనూ కంటిన్యూ చేసింది.

70 స్థానాల్లో కాంగ్రెస్, 37 నియోజకవర్గాల్లో భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఆధిక్యతలో కనిపించారు. అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్.. అయిదు చోట్ల లీడింగ్‌లో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ఆధిక్యతను పెంచుకోగలిగింది. తొలుత మూడు చోట్ల లీడింగ్‌లో ఉన్న కమలం పార్టీ అభ్యర్థులు ఆ తరువాత అయిదు చోట్ల పైచేయి సాధించారు.
ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఈ ఆధిక్యత చేతులు మారే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆంతర్యం అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం వెనుకంజలో నిలిచారు. తన కంచుకోట గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ వెనుకపడ్డారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పాగా వేసేలా కనిపిస్తోంది. బీజేపీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధిక్యతలో నిలిచారు.
గజ్వేల్ నుంచి కేసీఆర్ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యతతో తన సమీప ప్రత్యర్థులను మట్టికరిపించారు. ఈ సారి మాత్రం ఆయనకు ఎదురుగాలి వీస్తోంది.. ఇదే గజ్వేల్ నియోజకవర్గంలో. ఈటెల ఆధిక్యతలో కొనసాగుతున్నారిక్కడ. కామారెడ్డిలో కేసీఆర్ ఆధిక్యతలో ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి వెనుకపడ్డారు.












Click it and Unblock the Notifications