Telangana election results 2023: కల్వకుంట్ల కవితలో అదే ధీమా
Kalvakuntla Kavitha: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. సరిగ్గా ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 43 స్థానాల్లో కాంగ్రెస్, 28 నియోజకవర్గాల్లో భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థులు ఆధిక్యతలో కనిపించారు.
అఖిల భారత మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్.. అయిదు చోట్ల లీడింగ్‌లో ఉన్నారు. మూడు చోట్ల భారతీయ జనతా పార్టీ ఆధిక్యతలో ఉంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఈ ఆధిక్యత చేతులు మారే అవకాశం ఉంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆంతర్యం అధికంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఓట్ల లెక్కింపు సరళిపై బీఆర్ఎస్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) స్పందించారు. తాము అధికారాన్ని నిలబెట్టుకుంటామని వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం మూడోసారి తమకు అధికారాన్ని అప్పగిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉదయం ఎఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.
తెలంగాణ ప్రజల ఆశీర్వాదం తమ వెంటే ఉందని కవిత పేర్కొన్నారు. తాము చేసిన మంచి పనులు, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్సే అయినప్పటికీ- దీని కోసం అసమాన పోరాటం చేశామని అన్నారు.
10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చామని కవిత తెలిపారు. ప్రారంభ ఫలితాలు భిన్నంగా ఉన్నప్పటికీ- అంతిమ విజయం తమదే అవుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications