రేపు తెలంగాణ అసెంబ్లీ భేటీ-ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రమాణం..
తెలంగాణ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ తొలిసారి సమావేశం కాబోతోంది. రేపు ఉదయం జరిగే అసెంబ్లీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అంతా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ భేటీకి ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించబోతున్నారు.

తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 సీట్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 64 స్ధానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 39 సీట్లలో గెలిచింది. బీజేపీ 8 సీట్లలోనూ, ఎంఐఎం 7 సీట్లలోనూ, సీపీఐ ఓ సీటులోనూ గెలిచాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం వీరు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక ఉంటుంది. అనంతరం విపక్ష నేత, ఉపనేత, ప్రభుత్వ విప్ ల ఎంపిక తంతు పూర్తి చేస్తారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం కాలు విరగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాబట్టి ఆయన రేపటి అసెంబ్లీ భేటీకి గైర్హాజరు అవుతారు. మిగతా ఎమ్మెల్యేలంతా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఆయన ఎన్నిక లాంఛనమే కానుంది. డిప్యూటీ స్పీకర్ గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి. అలాగే విపక్ష నేతగా కేసీఆర్ ఈసారి ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఆయనకు బదులుగా కేటీఆర్, హరీష్ లో ఎవరుంటారనేది కూడా ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications