Telangana Polls: తెలంగాణలో నవంబర్ 30న ఎన్నికలు-డిసెంబర్ 3న ఫలితాలు
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన ఎన్నికల సంఘం ఇందులో భాగంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీల్ని కూడా ప్రకటించింది. దీని ప్రకారం తెలంగాణలో ఒకే దశలో అన్ని అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు నిర్పహించాలని సీఈసీ రాజీవ్ కుమార్ నిర్ణయించారు. నవంబర్ 30న ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ఈసీ..డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించబోతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ప్రకటించిన షెడ్యుూల్ ప్రకారం నవంబర్ 3న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తారు. అనంతరం నవంబర్ 15న వరకూ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.ఆ తర్వాత నవంబర్ 30న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ చేపట్టి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. తాజాగా తెలంగాణలో మూడు రోజుల పాటు పర్యటించిన ఎన్నికల కమిషన్ బృందం రాజకీయ పార్టీలు, అధికారులతో భేటీ అయింది. వారి అభిప్రాయాలు తెలుసుకుంది. అనంతరం ఇవాళ షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ఈసారి మొత్తం 3.71 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు ఈసీ వెల్లడించింది. అలాగే రాష్ట్రంలో ప్రతీ 897 ఓటర్లకు ఓ పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.
తెలంగాణలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్.. విపక్ష కాంగ్రెస్, బీజేపీతో పోటీ ఎదుర్కొంటోంది. ఇందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే అసలు పోరు ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. బీజేపీ పలు చోట్ల ఓట్లను చీల్చే అవకాశాలు ఉన్నాయి. తాజాగా వెలువడిన పలు సర్వేల్లో కాంగ్రెస్ ముందంజలో ఉందన్న అంచనాలు బీఆర్ఎస్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. అదే సమయంలో సీఎం కేసీఆర్ అనారోగ్యంతో ఇంటికే పరిమితం కావడంతో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ భారాన్ని మోస్తున్నారు.












Click it and Unblock the Notifications