ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న తెలంగాణ బీజేపీ
Raja Singh: తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు తమ పంతం నెరవేర్చుకున్నారు. ఎట్టకేలకు- శాసన సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీకి చెందిన ఎనిమిది శాసన సభ్యులు కొద్దిసేపటి కిందటే ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ జీ ప్రసాద్ కుమార్ వారితో ప్రమాణం చేయించారు.
ప్రొటెం స్పీకర్‌గా ఏఐఎంఐఎం శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని వారు బహిష్కరించిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేయడానికి నిరాకరించారు. సమావేశాలను బాయ్‌కాట్ చేశారు. ఎంఐఎం సభ్యుడు స్పీకర్ స్థానంలో ఉండగా.. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సభలో అడుగుపెట్టబోమంటూ అప్పట్లో ప్రతిజ్ఞ చేసిన విషయం తెలిసిందే.

ప్రొటెం స్పీకర్ ఎంపిక రాజ్యంగబద్ధంగా జరగలేదనేది బీజేపీ ఎమ్మెల్యేల ఆరోపణ. శాసన సభలో అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నిక చేయాల్సి ఉంటుందని, అలాకాకుండా ఏఐఎంఐఎంతో ఉన్న దోస్తీ కారణంగానే అక్బరుద్దీన్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిందని బీజేపీ విమర్శిస్తోంది. ముస్లింల సంతుష్టీకరణకు తెర లేపిందని ధ్వజమెత్తింది.
అక్బరుద్దీన్ ఒవైసీ వరుసగా ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో తొలిసారిగా ఆయన చంద్రాయనగుట్ట నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా విజయం సాధించారు. ఇప్పటివరకు ఆయనకు ఓటమి అనేది ఎదురుకాలేదు. ప్రస్తుత శాసనసభలో సీనియర్ సభ్యుల్లో ఆయనా ఒకరు.
శాసనసభలో స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నికయ్యాక, బిజెపి తరపున శాసనసభకు ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. #BJPMLAs #TelanganaAssembly pic.twitter.com/6cycL8RLEa
— BJP Telangana (@BJP4Telangana) December 14, 2023
అక్బరుద్దీన్ కంటే సీనియర్.. కాంగ్రెస్‌కు చెందిన నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఏడుసార్లు ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. నాలుగుసార్లు హూజూర్ నగర్ నుంచి మూడుసార్లు కోదాడ నుంచీ గెలుపొందారు. సీనియారిటీ ప్రకారం చూసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయాల్సి ఉంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందున ఆయన పేరును పరిశీలనలోకి తీసుకోలేదు.
అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని తప్పుపడుతూ సమావేశాలను బహిష్కరించారు బీజేపీ సభ్యులు. ప్రసాద్ కుమార్ స్పీకర్‌గా బాధ్యతలను స్వీకరించడంతో వారు ప్రమాణ స్వీకారం చేశారు.
డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు- సిర్పూర్, పాయల్ శంకర్- ఆదిలాబాద్, ఆలేటి మహేశ్వర్ రెడ్డి- నిర్మల్, రామారావు పటేల్- ముధోల్, పైడి రాకేష్ రెడ్డి- ఆర్మూర్, కాటేపల్లి వెంకటరమణారెడ్డి- కామారెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా- నిజామాబాద్ అర్బన్, టీ రాజా సింగ్- గోషా మహల్.. ప్రమాణ స్వీకారం చేశారు.












Click it and Unblock the Notifications