Telangana budget 2021: నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్ రావు...
నేడు(మార్చి 18) తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికమంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఉదయం 11.30గంటలకు సభలో హరీశ్ బడ్జెట్ ప్రవేశపెడుతారు. శాసనమండలిలో మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెడుతారు. బుధవారం(మార్చి 17) సాయంత్రం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర కేబినెట్ బడ్జెట్‌కు ఆమోద ముద్ర వేసింది.
కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న తరుణంలో ప్రవేశపెట్టబోతున్న బడ్జెట్ కావడంతో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతికూలతను ఎదుర్కొంటున్న సమయంలో ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎప్పటిలాగే సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని ఇప్పటికే చెప్పిన ప్రభుత్వం... ఏయే శాఖలకు ఎంత కేటాయింపులు చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో నిరుద్యోగ యువత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో... బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ఉంటుందా ఉండదా అన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. కరోనా తర్వాత ఆదాయం తగ్గిపోవడం.. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో సామాన్య,మధ్య తరగతికి బడ్జెట్‌లో ఎలాంటి చర్యలు ఉంటాయన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది.సామాన్యుల నుంచి రియల్ వ్యాపారుల వరకు చాలామంది బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నారు.సామాన్యులపై పెట్రోల్,డీజిల్ భారాన్ని తగ్గించే చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు,యూనివర్సిటీల నిర్వహణకు అవసరమయ్యే నిధుల కేటాయింపులు చేపట్టాలన్న విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి.
తాజా కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ,మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై సీఎం కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. కేంద్రం ప్రైవేటీకరణ విధానాలు,వ్యవసాయ చట్టాలు,భైంసా అల్లర్లు తదితర అంశాలపై ఎలా స్పందించాలన్న దానిపై కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications