ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూతురు కవిత??
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కొత్త కోణం వెలుగు చూసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ స్కామ్ వెనక కవిత హస్తం ఉందని, ఆమె కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారంటూ భారతీయ జనతాపార్టీ ఎంపీ పర్వేశ్‌వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌సిర్సా ఆరోపించారు. ఢిల్లీ మద్యం విధానం అనేది కేసీఆర్ కుటుంబ సభ్యుల సలహా మేరకే రూపొందిందని, విధానాలు రూపొందించే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు భేటీలకు హాజరయ్యారని వీరిద్దరూ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ఢిల్లీ లిక్కర్ స్కాంతో నేరుగా సంబంధం ఉందని, ఎక్సైజ్ కమిషనర్ కూడా ఈ డీల్‌లో పాల్గొన్నారని వెల్లడించారు.

ఢిల్లీ పాలసీయే తెలంగాణలో
ఢిల్లీలో ఎటువంటి పాలసీ రూపొందించారో అలాంటి పాలసీయే తెలంగాణలో అమలవుతోందని, పశ్చిమ బెంగాల్‌లోను దీన్నే అమలు చేశారని పర్వేశ్ వర్మ తెలిపారు. తెలంగా రాష్ట్రంలో మద్యం మాఫియాకు చెందిన కీలక వ్యక్తి ఒకరు ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్‌లో ఆరునెలలు ఒక సూట్ రూమ్ బుక్ చేసుకున్నారని, అంతేకాకుండా మరొక వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ జెట్ విమానంలో కేసీఆర్ కుటుంబసభ్యలు ఢిల్లీకి వస్తుండేవారని తెలిపారు. ఈ పాలసీ కోసం మొదటి విడతగా తెలంగాణ నుంచి వచ్చినవారు రూ.150 కోట్లు చెల్లించారని, కేసీఆర్ కుటుంబ సభ్యులతో మనీష్ సిసోడియా భేటీ అయ్యారా? లేదా? చెప్పాలటూ ఎంపీ నిలదీశారు.

దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ దేశవ్యాప్తంగా 31 ప్రాంతాల్లో దాడులు చేసింది. 6 మందిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. వీరిలో ఐదుగురిని విచారించగా.. మరో 8 మందిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ 8 మంది దేశం విడిచి వెళ్లకుండా దేశంలోని అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లోని అధికారులను అప్రమత్తం చేశారు. వీటికి సంబంధించిన ఎల్‌వోసీలను జారీచేసినట్లు సీబీఐ తెలిపింది. ఎల్‌వోసీ జారీచేసిన 8 మంది ప్రభుత్వంతో సంబంధంలేని ప్రైవేట్ వ్యక్తులేనని వెల్లడించింది. సిసోడియా, గోపీ కృష్ణ, ఆనంద్ తివారీ, పంకజ్ భట్నాగర్ ప్రభుత్వ హోదాల్లో వివిధ పదవుల్లో ఉండటంవల్ల వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేయడం కుదరలేదని సీబీఐ స్పష్టం చేసింది

10 మంది తెలంగాణ వ్యాపారులకు వాటాలు
ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ సర్కార్ పాత మద్యం పాలసీని మార్చి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తడానికి కారణమైంది. జోన్లవారీగా షాపులకు అనుమతివ్వడంతోపాటు ఒక్కో జోన్‌లో ఎన్ని షాపులైనా పెట్టుకునేందుకు ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. లైసెన్సులన్నీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ద్వారా ఇప్పించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో ఉన్న మద్యం దుకాణాల్లో 10 మంది తెలంగాణకు చెందిన వ్యాపారులకు వాటాలున్నాయని సమాచారం. వీటికి సంబంధించిన డీల్స్ అన్నీ హైదరాబాద్‌లోనే జరిగాయని, సిసోడియా పలుసార్లు హైదరాబాద్ వెళ్లారని పర్వేష్ సాహిబ్‌సింగ్ వర్మ తెలిపారు.












Click it and Unblock the Notifications