గమ్మునుండలా... 'మునుగోడు' తర్వాత నీ పని పడతా!?
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత రాష్ట్ర సమితిగా మారింది. కానీ అధికారికంగా మారాల్సింది మాత్రం ఎన్నికల సంఘం దగ్గర. అక్కడ మారితేనే దేశవ్యాప్తంగా ఎక్కడ పోటీచేసినా కారు గుర్తును కేటాయిస్తారు. జాతీయ పార్టీ హోదా వస్తుంది. కానీ ప్రస్తుతం పేరు మార్పు అంశంలో ఈసీ దగ్గర టీఆర్ఎస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

పేరు మార్పుపై స్పందించిన కేటీఆర్
వాస్తవానికి విజయ దశమి పర్వదినం రోజు పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం కూడా చేశారు. తర్వాతరోజు ఆ ప్రతిని ఈసీకి అందజేశారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే భారత రాష్ట్ర సమితి పేరుపై మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేయాల్సి ఉంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దీనికి కొంత సమయం పట్టేట్లుగా కనపడుతోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ పేరు మార్పు అంశంపై స్పందించారు.

మోడీ అడ్డుకుంటున్నారంటున్న కేటీఆర్
ఎన్నికల సంఘాన్ని సంప్రదించి చాలారోజులవుతోందని, అయినా వారి నుంచి ఎటువంటి స్పందనా లేదన్నారు. తెలంగాణకు ఎటువంటి ప్రాజెక్టులు రాకుండా, ఆర్థికంగా కేంద్రం నుంచి రావాల్సినవాటిని రానివ్వకుండా నరేంద్రమోడీ అడ్డుకుంటున్నారనేది కేటీఆర్ అభియోగం. ఈసీ దగ్గర పేరు మార్పు అంశాన్ని కూడా మోడీ అడ్డుకుంటున్నారనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గా మారే క్రమంలో అడ్డంకులు ఎదురవబోతున్నాయని, అటువంటి సంకేతాలు రావడంవల్లే కేటీఆర్ అలా వ్యాఖ్యానించి ఉంటారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.

ఉప ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ పై దృష్టి
ప్రస్తుతానికి తెలంగాణలో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక జరగనుండటంతో అధిష్టానం దీనిపై దృష్టి కేంద్రీకరించింది. ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత కేసీఆర్ దీనిపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తారని పార్టీవర్గాలు వెల్లడించాయి. ఒకవేళ కేటీఆర్ వ్యాఖ్యానించినట్లుగా బీఆర్ఎస్ పేరు మారకుండా బీజేపీ పెద్దలు అడ్డంకులు సృష్టిస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని కేసీఆర్ ముందే రూపొందించుకున్నారని, అదే జరిగితే అందుకు తగ్గ వ్యూహాన్ని అమలు చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications