రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ, ఇప్పటికే స్టాలిన్, విజయన్, మమత లేఖలు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఐఏఎస్‌ల నిబంధనల సవరణపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
ఏకపక్ష నిర్ణయమంటూ ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
ఈ నిబంధనల సవరణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ప్రతిపాదిత సవరణలు రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సవరణలను వ్యతిరేకిస్తోందని అన్నారు. రాష్ట్రాల అనుమతి లేకుండా అధికారులు కేంద్ర సర్వీసులకు తీసుకోవడం ఏకపక్ష నిర్ణయమని అన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్రాల్లో పనిచేసే అధికారులపై కేంద్రం పరోక్షంగా నియంత్రించే ఎత్తుగడ అని, ఇది రాష్ట్ర ప్రభుత్వాల పనితీరులో జోక్యం చేసు కోవడమేనని అన్నారు.

ఇప్పటికే ప్రధాని మోడీకి పలు రాష్ట్రాల సీఎంల లేఖలు
కాగా, తెలంగాణ కంటే ముందే పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు సహా పలు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ విషయమై ప్రధానికి లేఖ రాయడం గమనార్హం. ఈ విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి రెండు లేఖలు రాశారు. ఆమె తన రెండవ లేఖలో, "సవరించబడిన సవరణ ప్రతిపాదన మునుపటి కంటే చాలా కఠినమైనదని నేను భావిస్తున్నాను. వాస్తవానికి ఇది మన గొప్ప సమాఖ్య రాజకీయాల పునాదికి.. భారత రాజ్యాంగ ప్రణాళిక ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధమని నేను భావిస్తున్నాను అని పేర్కొన్నారు.

ఐఏఎస్ కేడర్ రూల్స్ మార్పులపై కేంద్రం ఇలా..
ఇది ఇలావుండగా, తాజా కేంద్ర ప్రతిపాదనల ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే ఏ ఐఏఎస్ అధికారినైనా డిప్యూటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకోవచ్చు. దీనిపైనే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ సవరణలు పలు రాష్ట్రాలు ఇప్పటికే వ్యతిరేకించాయి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ అంశంపై ప్రధానికి ఇప్పటికే లేఖలు రాశారు. కాగా, ఈ నిబంధనలో మార్పుకు సంబంధించి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారులను ఎల్లప్పుడూ రాష్ట్రాలలో ఉంచలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఎందుకంటే, ఇది వారి సర్వీస్, అధికారులు రెండింటికీ సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడం వల్ల రాష్ట్రాలలో పనిచేసి, కేంద్రానికి తిరిగి వచ్చిన తర్వాత అధికారుల వ్యక్తిగత అభివృద్ధికి ఒక ప్రత్యేక విధానం లభిస్తుందని కేంద్రం పేర్కొంది.












Click it and Unblock the Notifications