కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ ఫోన్: ఏం మాట్లాడారంటే?
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా రేవంత్ కోరారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై పరస్పర సహకారం ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పలు పెండింగ్ అంశాలు, పరస్పర సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ కోరారు. ఇది ఇలావుండగా, సీఎం రేవంత్ వరుసగా అన్ని కీలక అంశాలపై వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి బుధవారం సచివాలయంలో 'ధరణి'పై సీఎం రేవంత్ సమీక్షించారు. ధరణి పోర్టల్ పై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ధరణి పోర్టల్ పై సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భూముల సర్వే, డిజిటలైజేషన్, టైటిల్ గ్యారంటీ చట్టం తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 83 కోట్లు ఇచ్చిందన్న సీఎం రేవంత్.. ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అంతేగాక, నిషేధిత భూముల జాబితా, అసైన్డ్, పట్టా భూముల వివరాలు సహా మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్ ను సీఎం ఆదేశించారు.
భూముల డిజిటలైజేషన్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యలకు నిలయంగా మారిందని ఈ సందర్భంగా సీఎం రేవంత్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ధరణిని రద్దు చేసి ఆ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధరణిపై సుమారు రెండు గంటలపాటు సమీక్ష సమావేశం నిర్వహించడం గమనార్హం.












Click it and Unblock the Notifications