కొండా సురేఖకు రేవంత్‌రెడ్డి షాక్... ఇద్దరు గన్‌మెన్ల తొలగింపు
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అక్కినేని నాగార్జున కుటుంబంపై, సమంతపై చేసిన వ్యాఖ్యలు ఎంతో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవి దుమారం సృష్టించాయి. తెలుగు సినీ పరిశ్రమ యావత్తూ కొండా సురేఖపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఒకరకంగా ఆమెపై యుద్ధం ప్రకటించిందని చెప్పొచ్చు. సమంతకు క్షమాపణలు చెబుతూ కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంది. అయినప్పటికీ ఆమెపై సినీరంగం నుంచి మాత్రం విమర్శలు ఆగడంలేదు.
నవీన్ రాజ్ పై ఆరోపణలు
ఇటువంటి తరుణంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రికి షాక్ ఇచ్చారు. కొండా సురేఖ దంపతులకు ప్రధాన అనుచరుడుగా ఉన్న నవీన్ రాజ్ కు ప్రభుత్వం కేటాయించిన ఇద్దరు గన్ మెన్లను వెనక్కి తీసుకుంది. నవీన్ రాజ్ పై కొంతకాలం తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, మంత్రి పేరు చెప్పి పెత్తనం చేస్తున్నారని, పోలీసుల అధికారులను అసలు లెక్కచేయడంలేదని, అందరినీ బెదిరిస్తున్నారంటూ చాలాకాలం నుంచి ఆరోపణలు వస్తున్నాయి.

సురేఖ చేసిన వ్యాఖ్యలే కారణమా?
దీంతో వరంగల్ పోలీసులు తాగాజా నవీన్ రాజ్ కు కేటాయించిన ఇద్దరు గన్ మెన్లను వీఆర్ కు అటాట్ చేశారు. ఈమేరకు వరంగల్ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. గత కొంతకాలం నుంచి నవీన్ రాజ్ పై ఆరోపణలు వస్తున్నపపటికీ ఇప్పటివరకు స్పందించిన ప్రభుత్వం, పోలీసులు ఇప్పుడు స్పందించి గన్ మెన్లను తొలగించారంటే అందుకు కారణం తాజాగా మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆమె చేసిన విమర్శల నేపథ్యంలో మద్దతివ్వడానికి కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ ముందుకు రావడంలేదు. కాకపోతే ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. నవీన్ రాజ్ విషయం రేవంత్ రెడ్డికి తెలుసా? ఆయనకు మంత్రులపై, పోలీసులపై నియంత్రణ ఉందా? అంటూ భారత రాష్ట్ర సమితి నాయకులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications