తెలంగాణలో నిలిచిన 161 ప్రాజెక్టులు: కేంద్రమంత్రితో సీఎం రేవంత్ రెడ్డి
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. గురువారం ఢిల్లీలోని ఇందిరా పర్యావరణ్ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్.. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను నివేదించారు.
తెలంగాణలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ శాఖ వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌కి విజ్ఞప్తి చేశారు. కేంద్ర అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయని వివరించారు.

38 ప్రాజెక్టులకు వన్యప్రాణి సంరక్షణ చట్టాల పరమైన అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణం అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ ప్రాజెక్టుల్లో అత్యధికం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని కేంద్ర మంత్రికి తెలియజేశారు.
అనుమతులు రాకపోవడంతో జాతీయ రహదారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో టవర్ల నిర్మాణం, పీఎంజీఎస్‌వై, పొరుగు రాష్ట్రాలను అనుసంధానించే రహదారుల నిర్మాణ పనులు నిలిచిపోయాయని సీఎం రేవంత్ తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
ముఖ్యమంత్రి రేవంత్ వెంట మంత్రులు కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.

కేంద్రమంత్రి కుమారస్వామితో సీఎం రేవంత్
కాలుష్యాన్ని నియంత్రించాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో వంద శాతం బస్సులను ఎలక్ట్రిక్ మోడల్‌లోకి మార్చేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో కుమారస్వామిని వారి కార్యాలయంలో కలిసి ఈ విషయంపై చర్చించారు.
పీఎం ఈ-డ్రైవ్ (PM E-Drive) పథకం కింద జీసీసీ పద్ధతిలో తెలంగాణకు బస్సులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకు ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రిట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉన్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చారు. హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే 2,800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ మోడల్ కింద కేటాయించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
కాలుష్యాన్ని నియంత్రించాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో వంద శాతం బస్సులను ఎలక్ట్రిక్ మోడల్‌లోకి మార్చేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి @hd_kumaraswamy గారికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కుమార… pic.twitter.com/8BebiujYp4
— Telangana CMO (@TelanganaCMO) January 16, 2025
కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మతో సీఎం రేవంత్ భేటీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై వారితో చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ వెంట రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు పోరిక బలరాం నాయక్, రఘువీర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు ఉన్నారు.












Click it and Unblock the Notifications