భార్య తీరుతో దామోదర మనస్తాపం, ప్రచారం నిలిపేసి..: పద్మిని అందుకే తిరిగి వచ్చారా?
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి గురువారం కొద్ది గంటల్లోనే పార్టీ కండువాను మార్చేశారు. మధ్యాహ్నం బీజేపీలో చేరిన ఆమె, రాత్రికి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నట్లు ప్రకటించారు. నరేంద్ర మోడీ పాలన పట్ల సానుకూలంగా ఉన్న ఆమె, కేవలం కీలక కాంగ్రెస్ నేత సతీమణి మరో పార్టీలో చేరారనే విమర్శల నేపథ్యంలోనే తిరిగి కాంగ్రెస్‌లో ఉండిపోయారు.
కొంతకాలంగా ఆమె కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీకి అవకాశం దక్కదనే స్పష్టమైన సంకేతాలు రావడంతో ఆమె అనూహ్యంగా గురువారం మధ్యాహ్నం బీజేపీలో చేరారు. హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్‌ల సమక్షంలో పార్టీలో చేరారు. ప్రధాని మోడీపై ఎప్పటి నుంచో అభిమానం ఉందని, ఎప్పుడో పార్టీలో చేరాలనుకున్నట్లు తెలిపారు. బీజేపీలో చేరే విషయం తన భర్తకు తెలుసునని కూడా చెప్పారు.
సంచలనం, భర్తకు ఝలక్!: బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత దామోదర భార్య పద్మిని, కారణాలివేనా?

అప్పుడు ఎన్నికల ప్రచారంలో దామోదర రాజనర్సింహ
పద్మినీ రెడ్డి బీజేపీలో చేరిన సమయంలో దామోదర రాజనర్సింహ పుల్కల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. భార్య పార్టీ మారిన విషయం తెలియగానే ఆయన ప్రచారం ఆపేశారు. హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. నేను ఓ పార్టీలో, నువ్వు ఓ పార్టీలో ఉంటే బాగుండదని ఒప్పించారో లేక మరేమో కానీ ఆమె రాత్రికి తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటన చేశారు. గురువారం రాత్రి సంగారెడ్డిలో ఇంట్లో మాట్లాడుతూ కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకుని తిరిగి వెనక్కు వచ్చేస్తున్నానని చెప్పారు. తాను నిర్ణయానికి ఇలాంటి రియాక్షన్ వస్తుందనుకోలేదన్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని చెప్పారు.
కాంగ్రెస్-బీజేపీ-కాంగ్రెస్: దామోదర సతీమణి సంచలన నిర్ణయం

మాట్లాడలేకపోయిన కుటుంబ సభ్యులు
భార్య బీజేపీలో చేరిన విషయం తెలియగానే ప్రచారం ఆపేసిన దామోదర రాజనర్సింహ ఏమీ మాట్లాడలేకపోయారు. మనోవేదనకు గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఏం మాట్లాడలేదు. పద్మినీ రెడ్డి నిర్ణయంతో అందరూ షాకయ్యారు. ఆ తర్వాత రాత్రి తిరిగి కాంగ్రెస్‌లో ఉంటానని చెప్పాక అందరూ ఊపిరి తీసుకున్నారు.

అందుకే తిరిగి వచ్చారా?
తెలంగాణలో రాష్ట్రస్థాయిలో కీలకంగా ఉన్న దామోదర రాజనర్సింహ ఉమ్మడి మెదక్ జిల్లాలో టికెట్ల కేటాయింపులోనూ తన వారికి ప్రాధాన్యం దక్కేలా చొరవ తీసుకుంటున్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రాధాన్యం ఇచ్చింది. గురువారం మధ్యాహ్నం జరిగిన పరిణామంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆయన భార్యను ఒప్పించి ఉంటారని, దీంతో సమస్య సద్దుమణిగిందని భావిస్తున్నారు.

ప్రచారం చేస్తానని బాబూ మోహన్
పద్మినీ రెడ్డి బీజేపీలో చేరిన విషయం తెలిసి, సంగారెడ్డిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే, నటుడు బాబూమోహన్ మాట్లాడుతూ... పద్మినీరెడ్డి తరఫున తాను ప్రచారం చేస్తానని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు మధ్యాహ్నం నుంచి ఈ విషయమై ఆరా తీశారు. కానీ రాత్రికి ఆమె కాంగ్రెస్ పార్టీకి వచ్చేశారు.
మరిన్ని మెదక్ వార్తలుView All
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!