ప్రధాని మోదీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి- ఏం జరుగుతోంది?
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భువనగిరి లోక్ సభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి- ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇవ్వాళ ఆయన ప్రధానిని కలిశారు. నియోజకవర్గ సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న పరిస్థితుల్లో కోమటిరెడ్డి.. ప్రధానిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరిచుకుంది.

పెండింగ్ అంశాలపై
సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉంటూ వస్తోన్న కొన్ని ప్రాజెక్టుల గురించి ప్రధాని దృష్టికి కోమటిరెడ్డి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వాటిని పరిష్కరించాలని కోరారు. నమామి గంగే తరహాలో మూసీనదిని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, విషపూరితంగా మారిన ఈ నీటిని శుద్ధి చేయకుండా దిగువకు విడుదల చేయడం వల్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని ప్రధానికి వివరించారు. మూసీనది ప్రక్షాళన కోసం నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆరు లేన్లుగా హైదరాబాద్-విజయవాడ ఎన్‌హెచ్
అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటోన్నాయని, వాటిని నివారించడంలో భాగంగా దీన్ని ఆరులేన్లుగా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. బెంగళూరు-మైసూరు తరహాలో ఈ రహదారిని అభివృద్ధి చేయాలని కోరారు. ఈ రహదారిపై ఉన్న వాహన రద్దీని నివారించడానికి ప్రస్తుతం ఎల్బీ నగర్ వరకు ఉన్న మెట్రో రైలు సర్వీసును భువనగిరి వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.
అకాల వర్షాలపై..
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన అకాల వర్షాలకు పెద్ద ఎత్తున నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానిని కోరారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని పంపించడానికి మోదీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఇటీవలే వడగండ్ల వర్షం కురిసిన విషయం తెలిసిందే. వర్షానికి వరి, ఉద్యానపంటలు పెద్ద ఎత్తున నాశనం అయ్యాయి.
తెలంగాణ స్థితిగతులపై ఆరా..
తెలంగాణలో రాజకీయ స్థితిగతులపై గురించి కూడా ప్రధాని ఆరా తీసినట్లు తెలుస్తోంది. భారత్ రాష్ట్ర సమితి పరిపాలన తీరును అడిగి తెలుసుకున్నారని సమాచారం. తెలంగాణాపై తాను దృష్టి సారిస్తానని ప్రధాని హామీ ఇచ్చారని చెబుతున్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉన్నట్లుగా భావిస్తోన్న అవినీతి గురించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా ప్రధానికి వివరించారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications