V Hanumantha Rao: ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత: సరిగ్గా ఏడాది తరువాత!
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంత రావు అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతోన్న ఆయనను కుటుంబ సభ్యులు హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. త్వరలోనే డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గత ఏడాది సరిగ్గా ఇదే నెలలో ఆయన కరోనా వైరస్ బారిన పడ్డారు. వేగంగా కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరారు. రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారు.
Recommended Video
కొంతకాలంగా హనుమంత రావు కిడ్నీ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దానికి ఆయన చికిత్స తీసుకుంటోన్నారు. అదే సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇంటికి దగ్గరలోనే ఉన్న హైదర్‌గూడ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీహెచ్ డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటోన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పలువురు కాంగ్రెస్ నాయకులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీహెచ్ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు రేవంత్ రెడ్డి నియామకాన్ని వీ హనుమంతరావు మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోన్నారు. పార్టీ అధిష్ఠానం అధికారికంగా ఆయన పేరును ఖరారు చేసింది. దీనిపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ పార్టీ అధిష్ఠానానికి వీ హనుమంత రావు లేఖ రాయాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి లేఖ రాస్తారని సమాచారం. కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచీ కొనసాగుతోన్న వీహెచ్‌తో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి పలువురు సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల కొంత అసంతృప్తిగా ఉంటోన్నారు.












Click it and Unblock the Notifications