సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి తప్పిన ప్రమాదం... కారును ఢీకొట్టిన మరో వాహనం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తృటిలో రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. హన్మకొండలో ఆయన ప్రయాణిస్తున్న కారును మరో వాహనం ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం నుంచి చాడ వెంకట్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటన జరిగిన తీరును పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇక హన్మకొండలో ఆదివారం(ఏప్రిల్ 4) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించటంలో రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడకపోవటంతో బోడా సునీల్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల వల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని, రైతులు రోడ్డున పడుతున్నారని పేర్కొన్నారు.

కాగా,తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వట్లేదన్న కారణంతో ఇటీవల బోడ సునీల్ అనే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం(ఏప్రిల్ 2) తెల్లవారుజామున నిమ్స్ మిలీనియం బ్లాక్ ఐసీయూలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. సునీల్ ఐదేళ్లుగా పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు.2016లో నిర్వహించిన పోలీస్ ఉద్యోగ నియామకాల్లో అర్హత సాధించి దారుఢ్య పరీక్షల్లో రాణించలేకపోయాడు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ప్రభుత్వం ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వదని మనస్తాపం చెందారు. గత నెల 26న కేయూ క్రీడా మైదానంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.నేను చేతకాక చావడం లేదు.. నా చావుతోనైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలి... అంటూ ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు.












Click it and Unblock the Notifications