రాష్ట్రవ్యాప్తంగా వాటిని తక్షణమే తొలగించాలి.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఇటీవల హైదరాబాద్ లోని రామాంతపూర్ లో జరిగిన ఘటన యావత్ రాష్ట్రాన్ని షాక్ కు గురిచేసింది. రామంతపూర్ లోని గోఖలేనగర్ లో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో రథానికి విద్యుత్ తీగలు తగిలిన ఘటన ఐదుగురు మృతి చెందారు. రథాన్ని లాగుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే మృతుల కుటుంబాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల నష్టపరిహారం కూడా ప్రకటించింది.
అయితే రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను తక్షణమే తొలగించాలని విద్యుత్ శాఖకు సూచించారు. ఈ మేరకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేబుల్ ఆపరేటర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని భట్టి విక్రమార్క మండి పడ్డారు.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా విద్యుదాఘాతం కారణంగా పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. వర్షాల కారణంగా విద్యుత్ తీగలు తగిలి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల రామంతపూర్ లో విద్యుత్ తీగలు తగిలి ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే పాతబస్తీలోని బండ్లగూడ రోడ్డు వద్ద వినాయకుడి విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా.. విద్యుత్ షాక్ తగిలి మరో ఇద్దరు మృతి చెందారు.

ఇలా వరుస ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఉన్న కరెంట్ స్తంభాలపై ఉన్న కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని ఈ మేరకు విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక ఎలాంటి అనుమతులు లేకుండా విద్యుత్ కనెక్షన్లు పొందుతున్న వారిని గుర్తించి తక్షణమే వారికి విద్యుత్ సరఫరా నిలిపివేయాలన్నారు.












Click it and Unblock the Notifications