మిచౌంగ్ తుఫాను హెచ్చరికలతో కలెక్టర్లకు తెలంగాణా విపత్తుల నిర్వహణ శాఖ అలెర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం తెలంగాణాపై పడింది. తుఫాను ప్రభావంతో తెలంగాణా రాష్ట్రంలో నిన్నటి నుండే వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వాతావరణ శాఖ ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
బంగాళా ఖాతం లో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిచౌంగ్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణా రాష్ట్ర విపత్తుల నిర్వహణా శాఖ అలెర్ట్ అయ్యింది. ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబ్ బాద్, సూర్యాపేట తదితర జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన అధికారులను అలెర్ట్ చేశారు. నేడు, రేపు రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటోకాల్స్ కు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు .ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు .
నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాల శాఖ, పంచాయితీ రాజ్, రెవిన్యూ శాఖ లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందరూ సమన్వయంతో పని చెయ్యాలని విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా సూచించారు. ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వేలు , లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని సూచించారు . అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సూచించారు.












Click it and Unblock the Notifications