తెలంగాణలో వరుణుడి టూర్ ఖరారు..! వచ్చే 4 రోజులు దబిడిదిబిడే..
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా నైరుతి వైపుగా కదులుతోంది. రాగల 12 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజులుపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
అల్పపీడనం ప్రభావం కారణంగా.. రేపు, ఎల్లుండి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణ పేట్ జిల్లాల్లో అల్పపీడనం ప్రభావం ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అధిక వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఈనెల 24, 25 తేదీల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోందని ఐఎండీ పేర్కొంది. చలి తీవ్రత అధికంగా ఉత్తర భారతంలోనే ఉంటుందని స్పష్టం చేసింది.

అలాగే నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం కారణంగా ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. అల్ప పీడన ప్రభావంతో రాగల 5 రోజులపాటు రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications