Telangana Eamcet 2021 : అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల... పూర్తి వివరాలివే...
తెలంగాణలో ఎంసెట్ అడ్మిషన్స్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది.ఈనెల 30 నుంచి సెప్టెంబర్ 9వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ఉంటుందని వెల్లడించింది. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని తెలిపింది.ఆ తర్వాత సెప్టెంబర్ 13 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుందని... సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌పై చర్చించేందుకు మంగళవారం(అగస్టు 10) తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన ప్రవేశ పరీక్షల కమిటీ సభ్యులు, విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సమావేశమయ్యారు. ఇదే సమావేశంలో షెడ్యూల్‌ను ఖరారు చేశారు. రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ కోసం అధికారులు మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 4 నుంచి 10 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో భాగంగా 4,5,6 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు 9,10 తేదీల్లో అగ్రికల్చర్, మెడికల్ పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది 2.51లక్షల మంది వరకు విద్యార్థులు ఎంసెట్ పరీక్షలు రాయనున్నారు. ఇంజనీరింగ్ పరీక్షకు దాదాపు 1.64 లక్షల మంది విద్యార్థులకు హాజరు అవుతుండగా, మెడికల్ పరీక్షకు 86వేలకు పైగా మంది హాజరు కానున్నారు.
ఎంసెట్ పరీక్ష మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తుండగా.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 వరకు నిర్వహిస్తున్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా హాల్‌లోకి అనుమతించట్లేదు. రెండు గంటల ముందుగానే పరీక్ష కేంద్రం లోపలికి విద్యార్థులను అనుమతిస్తున్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్స్ తీసుకుంటున్నారు. అందులో విద్యార్థుల ఆరోగ్య వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది.
జ్వరం లేదా జలుబుతో బాధపడుతున్న విద్యార్థులు ముందుగానే అధికారులకు తెలియజేయాలి. తద్వారా వారికి ప్రత్యేకంగా, అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థుల బాడీ టెంపరేచర్ చెక్ చేస్తారు. లోపలికి వెళ్లేముందు చేతులకు శానిటైజర్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Recommended Video
గతంలో ఎంసెట్ పరీక్షకు ఇంటర్ సిలబస్ వెయిటేజి ఉండేది. కానీ ఈ ఏడాది వెయిటేజీ తొలగించారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడిన విద్యార్థులు నష్టపోకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications