డీసీపీ, ఏసీపీ, సీఐలపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు: ఎందుకంటే?
హైదరాబాద్: ఎన్నికల విధుల్లోనిర్లక్ష్యం, పక్షపాతం వహించిన అధికారులపై ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపించారని ముగ్గురు పోలీసు అధికారులను బుధవారం ఈసీ సస్పెండ్ చేసింది. ముషీరాబాద్ పరిధిలో నగదు స్వాధీనం వ్యవహారంలో పక్షపాతం చూపించారని డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి, సీఐ జహంగీర్‌ను ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది.
ఈ ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి ఈసీ లేఖ రాసింది. కాగా, ఎన్నికల తనిఖీల్లో భాగంగా ముషీరాబాద్‌లోని సంతోష్ ఎలైట్ అపార్ట్‌మెంట్‌లో రూ. 18 లక్షల నగదు, చెక్ బుక్, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు ముషీరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ కుమారుడు ముఠా జైసింహదిగా గుర్తించారు పోలీసులు. అయితే, ఎప్ఐఆర్‌లో నిందితుల వివరాలు గుర్తు తెలియని వారిగా పేర్కొన్నారు.

ఈ కేసులో ముఠా జైసింహను కాకుండా ముఠా గోపాల్ స్నేహితులు సంతోష్, సుధాకర్‌లను అరెస్ట్ చేశారు. అసలైన నిందితులను అరెస్ట్ చేయకుండా.. సరైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. దీంతో ముషీరాబాద్ ఇన్‌స్పెక్టర్ జహంగీర్, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఐ జహంగీర్ స్థానంలో ముషీరాబాద్ స్టేషన్‌లో పనిచేస్తున్న డీఐ వెంకట్ రెడ్డిని నియమించినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు, మద్యం, ఆభరణాలు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మొత్తం 700 కోట్లకుపైగా సొత్తును సీజ్ చేశారు. గురువారం ఎన్నికలు జరగనున్న క్రమంలో బుధవారం కూడా విస్తృతంగా పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications