Telangana election polling : మొరాయిస్తున్న ఈవీఎంలు, రంగంలో 400మంది టెక్నికల్ సిబ్బంది
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు. టెక్నికల్ సమస్యలు చోటు చేసుకోవడంతో, ఆ సమస్యలను పరిష్కరించే పనిలో పడ్డారు టెక్నికల్ సిబ్బంది.
మొరాయిస్తున్న ఈవీఎంలను 400 మంది టెక్నికల్ టీం తో అధికారులు సరి చేస్తున్నారు. ఈవీఎంల మొరాయింపులపై జాయింట్ సీఈవో మానిటరింగ్ చేస్తున్నారు. సూర్యాపేట 89 పోలింగ్ బూత్ లో మొరాయిస్తున్న ఈవీఎంలో సాంకేతిక సమస్యను సరిదిద్దే ప్రయత్నం లో టెక్నికల్ సిబ్బంది ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్ళిన కాంగ్రెస్ అభ్యర్ధి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఓటు వేసే క్రమంలో ఈవీఎం మొరాయించింది.

ధర్మపురి 39 పోలింగ్ బూత్ లో EVM మొరాయించగా సాంకేతిక సమస్యను సరిదిద్దే ప్రయత్నం లో టెక్నికల్ సిబ్బంది ఉన్నారు. నాగార్జునసాగర్ 103 పోలింగ్ బూత్ వద్ద మొరాయిస్తున్న ఈవీఎంతో అక్కడ పోలింగ్ ఇంకా మొదలుకాలేదు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం ఆర్లగూడెం లోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 125లో మొరాయించిన ఈవీఎం మిషన్ ను టెక్నికల్ టీం సరిదిద్దుతున్నారు.
కోదాడ పట్టణంలో సీసీ రెడ్డి స్కూల్ లోని 175 మరియు కోమరబండ లోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 168 లో ఈవీఎం మిషన్లు మొరాయించడంతో పోలింగ్ ఇంకా మొదలు కాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం లో పోలింగ్ కేంద్రం 114 లో మాక్ పోలింగ్ సమయంలో EVM లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో దాని స్థానంలో మరొకటి ఏర్పాటు చేశారు.
ఇలా అనేక చోట్ల ఈవీఎం ల మొరాయింపుతో పాటు,సిబ్బంది సరిగా శిక్షణ తీసుకోకపోవటం వంటి కారణాలతో పోలింగ్ ఆలస్యంగా సాగుతుంది. అంతేకాదు చీకటి గదులలో పోలింగ్ ఏర్పాటు చేయటం కూడా ఒక్కో చోట ఓటర్లకు ఇబ్బంది కలిగిస్తుంది. ఎన్నికల కమీషన్ అధికారులు పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని వైపుల నుండి మానిటరింగ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications