వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ దూకుడు .. వరంగల్ తూర్పులో కొండా వర్సెస్ ఎర్రబెల్లి హోరాహోరీ!!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతుంది. ప్రారంభ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి, ములుగు, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతుంది. స్టేషన్ ఘన్పూర్, జనగామ, నర్సంపేట, పరకాలలలో బీఆర్ఎస్ ఆధిక్యం కొనసాగుతుంది.
ప్రారంభ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఆశాజనకంగా ఉండడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటివరకు కౌంటింగ్ జరిగిన పోస్టల్ బ్యాలెట్ లలోను చాలా స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించడం కాంగ్రెస్ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అంతేకాదు ఇప్పటివరకు అధికారికంగా వరంగల్ మార్కెట్లో కొనసాగుతున్న కౌంటింగ్ లో ఇచ్చిన ఫలితాలలో నర్సంపేట, పరకాల నియోజకవర్గం మినహాయించి మిగతా స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.

వరంగల్ తూర్పు లో మొదటి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖకు 3727 ఓట్లు, రెండవ స్థానంలో బిజెపి అభ్యర్థికి 3405 ఓట్లు, మూడవ స్థానంలో బి ఆర్ ఎస్ అభ్యర్థికి 2370 ఓట్లు పడ్డాయి. మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ 322 ఓట్ల ఆధిక్యతతో ఉంది. వర్ధన్నపేట నియోజకవర్గం లో తొలి రౌండు ఫలితాలు వెలువడ్డాయి. మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి కేర్ నాగరాజు స్వల్ప ఆధిక్యతను ప్రదర్శించారు.
బీ ఆర్ఎస్ ఆరూరి రమేష్ కు 4754 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కే ఆర్ నాగరాజు 4827 ఓట్లు, బిజెపి అభ్యర్థి కొండేటి శ్రీధర్ 663 ఓట్లు పోలయ్యాయి. ఈ రౌండ్లో 73ఓట్ల ఆధిక్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శించింది. మరోవైపు నర్సంపేట నియోజకవర్గం లో తొలి రౌండు ఫలితాలు వెలువడ్డాయి.
నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి దూకుడును కొనసాగిస్తున్నారు. 4573 ఓట్లు బి ఆర్ ఎస్ కు పడగా, 4233 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దొంతి మాధవ రెడ్డికి పోలయ్యాయి. బిజెపి అభ్యర్థి కంభంపాటి ప్రతాప్ కు కేవలం 134 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా చూస్తే బి ఆర్ ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ప్రస్తుతం పోరు కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications