Telangana election results: పాలకుర్తిలో ఎదురీదుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దూకుడును కొనసాగిస్తున్నారు. ఈ ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇప్పటికే వెల్లడి అవుతున్న ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయ కేతనాన్ని ఎగురవేస్తున్నారు. అశ్వరావుపేట, ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయాన్ని సాధించారు.
ఇదిలా ఉంటే ఈసారి బీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా పనిచేసిన వారికి కూడా ఎదురీత తప్పటం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ ఎన్నికల ఫలితాలలో చేదు అనుభవాన్ని చవిచూస్తున్నారు. ఆయన తన ప్రత్యర్థి 26 సంవత్సరాల యశస్విని రెడ్డి దాటికి విలవిలలాడుతున్నారు.

ఎన్నికల ప్రచారం ప్రారంభమైన నాటి నుండి నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని తిరుగుతూ ప్రచారం చేసిన మంత్రి ఎర్రబెల్లిని ప్రజలు ఆదరించలేదని ప్రస్తుతం ఉన ట్రెండ్ తో తెలుస్తుంది. పాలకుర్తి నియోజకవర్గం లో యశస్విని రెడ్డి ఇప్పటివరకు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు పాలకుర్తిలో ఐదు రౌండ్ల ఫలితాలు వెల్లడి కాగా 5 రౌండ్లలో 5297 ఓట్ల ఆధిక్యంతో అభ్యర్థి యశస్విని రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావుకు చుక్కలు చూపిస్తున్నారు.
మొదటి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ స్థానంలో ఓటమి పాలవుతారని చర్చ జరిగింది. పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చేసినప్పటికీ అనుచరులు చేసిన ఆగడాల వల్ల, మంత్రి దయాకర్ రావు పైన స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉందని, అది కాంగ్రెస్ పార్టీకి ఓటుబ్యాంకుగా మారిందని, అలాగే ఎన్నికల బరిలోకి దిగిన యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీరెడ్డి ఎన్నారై కాగా, ఆమెకు స్థానికంగా ఉన్న పేరు కూడా ఆమెకు ప్లస్ అయిందని తెలుస్తుంది.
ఏది ఏమైనా ఇప్పటి వరకు మెజారిటీ ఎన్నికలలో ఓటమి ఎరుగని నేతగా, మాస్ లీడర్ గా గుర్తింపు పొందిన ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా పరాజయం దిశగా అడుగులు వేయడం బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయానికి నిదర్శనంగా నిలుస్తోంది.












Click it and Unblock the Notifications