తెలంగాణా ఎన్నికలు: పవన్ కళ్యాణ్ తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ భేటీ.. ఎందుకంటే!!
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఆసక్తికర రాజకీయ సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్న సమయంలో తెలంగాణలో జనసేన, బీజేపీ ఉమ్మడి పోటీపై చర్చ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ భేటీ అయ్యారు.
తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మద్దతు వారు కోరారు. దీనికి స్పందించిన పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో చర్చ జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగాయి. జనసేన నాయకుల మనోగతాన్ని పవన్ కళ్యాణ్ బిజెపి నేతలకు వివరించారు.

2014లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం, బిజెపి అభ్యర్థుల గెలుపుకు కృషి చేశామని, బిజెపి కోరిక మేరకు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల పోటీ నుంచి విరమించుకుని బిజెపి అభ్యర్థుల విజయానికి కృషి చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా పోటీ చేయకపోతే కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని తెలంగాణ జనసేన నాయకులు చెబుతున్న విషయాన్ని పవన్ కళ్యాణ్ లక్ష్మణ్ మరియు కిషన్ రెడ్డికి తెలియజేశారు.
అయితే బిజెపి, జనసేన నాయకులు మద్దతు తోటి ఎన్నికల రంగంలోకి వెళ్లాలని భావిస్తుంటే, జనసేన 30 స్థానాలలో పోటీ చేస్తామని స్పష్టం చేస్తుంది. దీంతో ఉమ్మడిగా పోటీ చేసే విషయమై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాథమికంగా చర్చలు జరగగా రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ టిడిపి నేతలు తమతో కలిసి వస్తే జనసేనతో పొత్తు పెట్టుకుంటామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతామని ఆ పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఇక జనసేన పైన ఇటు బిజెపి, అటు టిడిపి రెండు ఆశలు పెట్టుకున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చే స్థాయిలో జనసేన పార్టీ లేకపోయినా, ఎన్నికలను జనసేన పార్టీ ప్రభావితం చేస్తుందని భావిస్తున్న నేపథ్యంలోనే బిజెపి పవన్ కళ్యాణ్ తో చర్చలు జరుపుతోంది.












Click it and Unblock the Notifications