కేసీఆర్ రాజీనామా?- గవర్నర్ అపాయింట్‌మెంట్
KCR resign: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుకుంది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైన ఈ కౌంటింగ్‌లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ఎగ్జిట్ పోల్స్ ఊహించినట్టే- అవి అంచనా వేసినట్టే- కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది.
తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను అలవోకగా అందుకుంది. భారత్ రాష్ట్ర సమితి కంచుకోటలను సైతం తుక్కు తుక్కు చేసింది. తొలి రౌండ్ నుంచే హస్తం పార్టీ అభ్యర్థులు భారీ ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చారు. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి సహా పలువురు అభ్యర్థులు విజయం సాధించారు. కొడంగల్‌లో రేవంత్ గెలిచారు. తన సమీప ప్రత్యర్థి, భారత్ రాష్ట్ర సమితికి చెందిన పట్నం నరేందర్ రెడ్డిని మట్టికరిపించారు. అశ్వారావుపేట, రామగుండంలల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆదినారాయణ, రాజ్ ఠాకూర్ గెలుపొందారు. పలు నియోజకవర్గాల్లో ఆధిక్యతలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు.
ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క ఘన విజయం సాధించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. విజయఢంకా మోగించారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కేసీఆర్ కేబినెట్‌లోని ఆరుమంది మంత్రులు మట్టికరిచారు.
ఈ ఘోర పరాజయాన్ని బీఆర్ఎస్ అంగీకరించింది. తాము ఓటమిని స్వీకరిస్తోన్నామని పేర్కొంది. రెండుసార్లు తమకు అధికారాన్ని అందించిన తెలంగాణ సమాజం పట్ల, ప్రజల పట్ల కృతజ్ఞతతో ఉంటామని, ఈ ఫలితాలను ఒక పాఠంగా భావిస్తామని, మళ్లీ పుంజుకొంటామని వివరణ ఇచ్చింది.
ఈ ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయనున్నారు. త్వరలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలుసుకోనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలుస్తోంది. సోమవారం నిర్వహించ తలపెట్టిన మంత్రివర్గ సమావేశం అనంతరం రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications