Telangana elections: వామపక్షాలకు బిఆర్ఎస్ తో కటీఫ్.. పెద్ద కారణమే!!
అసలు వామపక్షాలకు బిఆర్ఎస్ తో పొత్తులు ఎందుకు కుదరలేదు. నిన్న మొన్నటి వరకు పొత్తుల విషయంలో చర్చల స్థాయి వరకు వెళ్లిన ఇరు పార్టీలు మిత్రపక్షం నుంచి పాలక, ప్రతిపక్షాలుగా ఎందుకు మారాయి. మొన్నటి మునుగోడు ఉప ఎన్నికలలో అధికార బిఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి వచ్చే సాధారణ ఎన్నికలలో కూడా కలిసే పోటీ చేస్తామని అప్పట్లో ఇరు పార్టీలు కూడా ప్రకటించాయి. కానీ సీన్ కట్ చేస్తే బిఆర్ఎస్ ఒంటరిగానే పోటీకి వెళ్తున్నామని ప్రకటించింది.
సాధారణ ఎన్నికలలో లబ్ది పొందేందుకు సిపిఐ తనకు కంచుకోటగా ఉన్న మునుగోడు ఉప ఎన్నికలలో బలం ఉండి కూడా అధికార బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ పోటీకి దూరంగా ఉంది . భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇంతా చేసినా చివరి నిమిషంలో పొత్తులు కుదరక పోవడంతో ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఒకప్పుడు కమ్యూనిస్టులను సూది దబ్బనం పార్టీలు అంటూ ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ మొన్నటి మునుగోడు ఉప ఎన్నికలలో అదే వామపక్షాలను ప్రగతిశీల శక్తులు అంటూ పొగిడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో తన కంచుకోటలో సైతం పోటీకి దిగకుండా భవిష్యత్ అవసరాల దృష్ట్యా అధికార బిఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చి ఆ పార్టీ గెలుపుకు దోహదపడింది సిపిఐ పార్టీ.
ఆతరువాత కూడా సాధారణ ఎన్నికల కోసం సిపిఐ పార్టీతో బిఆర్ఎస్ పొత్తుకు సిద్ధమైంది. ఈ క్రమంలో అంతర్గతంగా జరిగిన చర్చలలో సిపిఐకి మునుగోడు కేటాయించి తన స్వంత నియోజకవర్గం కొత్తగూడెం సీటు కేటాయించలేదని భావించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధికార బిఆర్ఎస్ తో పొత్తులు తెగతెంపులు చేసుకొని పార్టీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేశారనేది మునుగోడు సిపిఐ నేతల ప్రధాన ఆరోపణ.
తన నియోజక వర్గమైన కొత్తగూడెం సీటు కేటాయించక పోవడం వల్లే సిపిఐ బిఆర్ఎస్ మధ్య పొత్తులు లేకుండా పోయాయని ఆపార్టీనేతలు ఆరోపిస్తున్నారు. దీంతో మళ్ళీ కాంగ్రెస్ తో దోస్తీ చేసుకొని మునుగోడు లేకుండా కొత్తగూడెం ఇస్తాము అనగానే కాంగ్రెస్ తో పొత్తులకు సిద్దమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి.
అయితే 2018 సాధారణ ఎన్నికల్లో కూడా మునుగోడు నియోజకవర్గ సిపిఐ అభ్యర్థిగా బిసి నేత నెల్లికంటి సత్యం ను అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆయనను బుజ్జగించి అప్పటి పొత్తులో కాంగ్రెస్ కు సిపిఐ మద్దతు ఇవ్వడం జరిగింది. ఇలా తమ కంచుకోటలోనే ఇతర పార్టీలకు మద్దతుఇస్తూ తమ ప్రాభవాన్ని కోల్పోయే పరిస్ధితులు ఏర్పడటంతో మునుగోడు సిపిఐ నేతలు తమ నాయకుల వ్యవహార శైలిపై సుముఖత వ్యక్తం చేయడం లేదు.
దీంతో వాస్తవాలు ఎలా ఉన్నా మునుగోడు నియోజకవర్గంలో మాత్రం తమకు టిక్కెట్ దక్కక పోవడంతో సిపిఐ నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే పొత్తులు ఆ పార్టీలో చీలికకు కారణమయ్యాయని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications