తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు- ఒక్క ఏడాదికే
తెలంగాణ ప్రభుత్వం ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిని పదేళ్లు పెంచుతూ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. ఇకపై 34 సంవత్సరాలకు బదులుగా 44 సంవత్సరాల వయస్సు వరకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అర్హులు. దీనికి సంబంధించి ప్రభుత్వం జీవో నంబర్ 86ను జారీ చేసింది. ఈ పెరిగిన వయోపరిమితి శాశ్వతం కాదు. ఏడాది కాలం పాటు మాత్రమే అమలులో ఉంటుంది.
నిరుద్యోగ యువత నుండి అందిన అనేక విజ్ఞప్తుల మేరకు ఈ వయోపరిమితి సడలింపు నిర్ణయాన్ని తీసుకుంది ప్రభుత్వం. మరింత మంది యువకులకు నియామక ప్రక్రియలో పోటీపడే అవకాశం కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యం. గతంలో 2024 ఫిబ్రవరి 8న జారీ చేసిన జీవో నంబర్ 30 ప్రకారం వయోపరిమితిని 10+2 సంవత్సరాలు పెంచి.. 46 ఏళ్లకు చేర్చింది. అది రెండేళ్ల పాటు అమలులో ఉంటుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇచ్చిన జీవో నంబర్ 30 ప్రకారం కాలపరిమితి ముగియడంతో, ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయోపరిమితి తిరిగి 34 ఏళ్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత తాజా జీవోను జారీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు దీన్ని జారీ చేశారు. నిరుద్యోగ యువత నుండి అందిన విజ్ఞప్తుల నిశితంగా పరిశీలించిన తర్వాత తాజా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఇందులో యూనిఫాం సర్వీసులను మినహాయించారు. యూనిఫాం సర్వీసులు అంటే.. పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక దళం, జైళ్లు, అటవీ శాఖల్లో ఉద్యోగాలకు ఇందులో నుంచి మినహాయించారు. ఆయా శాఖల్లో ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థుల వయోపరిమితి 34 సంవత్సరాలుగానే కొనసాగుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే యూనిఫాం రహిత పోస్టుల నియామకాలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. పదేళ్ల వయోపరిమితి పెంపు ఏడాది కాలం పాటు అమలులో ఉంటుందని జీఓలో స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications