ప్రాణాలు తీస్తోంది: చైనా మాంజాపై నిషేధం
హైదరాబాద్: పక్షులు, జంతువులకేగాక, మనుషుల ప్రాణాలకు సైతం ముప్పుగా మారిన చైనా మాంజా(దారం)ను నిషేధిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ, అటవీశాఖ అధికారులు పంపిన దస్త్రంపై మంత్రి జోగు రామన్న సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.
గాజు పెంకుల పొడి, నైనాల్ దారంతో చైనా మాంజాను తయారు చేస్తారు. అలాంటి దారంతో పతంగులు ఎగరవేయడం వల్ల పక్షులు, జంతువులు, చివరకు మనుషుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతోంది. కమ్యూనికేషన్, విద్యుత్తు తీగలు, ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలుగుతోంది. ఇది భూమిలో కలిసేది కానందున మట్టి, నీటి ప్రవాహాలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది.

ఆ దారం వల్ల కలుగుతున్న నష్టాలను పలు విభాగాలు, సంస్థలు మంత్రి జోగు రామన్న దృష్టికి తెచ్చాయి. దానిపై విచారణ జరిపి నివేదికను సమర్పించాల్సిందిగా ఆయన అధికారులను ఇటీవల ఆదేశించారు. ఈ క్రమంలో పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 సెక్షన్ 5 ప్రకారం మాంజాపై నిషేధం విధించారు.
చైనా మాంజా కొనుగోలు చేయడం, నిల్వ ఉంచడం, విక్రయించడం, వినియోగించం ఇక నేరంగా పరిగణించడం జరుగుతుంది. పర్యావరణ, అటవీ, జీవ వైవిధ్య విభాగం, ఇతర శాఖలు తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సంక్రాంతి పండగను పురస్కరించుకుని పిల్లలు, పెద్దలు పతంగులను ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే చైనా మంజాను ఉపయోగించడం వల్ల ఆ దారం బారిన పడి ఇప్పటికే అనేక పక్షులు మరణించాయి. మనుషులకు కూడా తీవ్ర గాయాలైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం చైనా మంజాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications