అనారోగ్యంతో ఆస్పత్రిలో ముక్కు అవినాష్ తల్లి... తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం...
జబర్దస్త్ కమెడియన్,బిగ్‌బాస్ నాలుగో సీజన్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్‌కు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. ముక్కు అవినాష్ తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో సీఎం రిలీఫ్ ఫండ్ కింద వైద్య ఖర్చుల కోసం రూ.60వేలు మంజూరు చేసింది. ఈ మేరకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ముక్కు అవినాష్‌కు ప్రభుత్వం తరుపున చెక్కును అందజేశారు. ప్రభుత్వం అందించిన ఈ సహాయాన్ని ముక్కు అవినాష్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ముక్కు అవినాష్ స్వగ్రామం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం. అతని తల్లి కాళ్ల లక్ష్మిరాజం కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. ఇందుకయ్యే ఖర్చు కోసం ముక్కు అవినాష్ కుటుంబ సభ్యులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం రూ.60వేలు నగదు మంజూరు చేసింది. ప్రభుత్వ సాయంపై ముక్కు అవినాష్ సంతోషం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న ముక్కు అవినాష్ కుటుంబాన్ని ఆదుకున్నందుకు ప్రభుత్వంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హౌస్‌లోకి లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అరియానాతో అవినాష్ అల్లరి షోలో బాగా హైలైట్ అయింది. బిగ్ బాస్ షో అనంతరం తల్లితో కలిసి అవినాష్ పలు టీవీ ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. అమ్మంటే తనకెంతో ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పాడు. కింది స్థాయి నుంచి వచ్చిన అవినాష్ బుల్లితెరపై తన మార్క్‌ను చాటుకోవడంపై తన తల్లి కూడా పలుమార్లు సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పుడా తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో ఆమె కుటుంబం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.