111 జీవో పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేత ఉత్తర్వులు: అసలేంటీ జీవో, జంట జలశయాల సంగతేంటి?
హైదరాబాద్: జీవో 111 పరిధిలోని 84 గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో ఆయా గ్రామాల్లో ఆంక్షలను ఎత్తివేస్తూ 69వ నెంబర్ ఉత్తర్వును పురపాలక శాఖ జారీ చేసింది. ఇటీవల మంత్రివర్గ భేటీలో నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.

జీవో 111 పరిధి గ్రామాల్లో ఆంక్షల ఎత్తివేత.. షరతులు వర్తిస్తాయి
జీవో 111 పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేయడంతోపాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాల్లో నీటి నాణ్యత దెబ్బతినరాదని షరతు విధించింది. షరతుల్లో భాగంగా ఎస్టీపీల నిర్మాణం, కాలుష్య తీవ్రత తగ్గింపునకు చర్యలు తీసుకోనున్నారు. భూగర్భ జలాల నాణ్యత పరిరక్షణకు చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం.. జలాశయాల్లోకి నీరు వెళ్లేలా డైవర్షన్ ఛానళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు విధివిధినాలు, సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. వీలైనంత త్వరగా కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జంట జలాశయాల పరిరక్షణ, కాలుష్య నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలు, గ్రీన్ జోన్లు సహా జోన్ల నిర్దరణ, ట్రంక్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ కమిటీ విధనాలు రూపొందించాల్సి ఉంటుంది. రోడ్లు, డ్రైన్లు, ఎస్టీపీలు, డైవర్షన్ డ్రైన్ల నిర్మాణానికి నిధులు సమీకరించాల్సి ఉంటుంది.

అసలేంటీ జీవో 111..
హైదరాబాద్ నగర శివారులోని గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల పరిరక్షణ కోసం జీవో 111 అమల్లో ఉంది. పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో నెంబర్ 192ను తీసుకొచ్చింది నాటి ప్రభుత్వం. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జోవో 111ను తెచ్చింది. ఈ జీవో ప్రకారం.. క్యాచ్‌మెంట్ పరిధిలో వేసే లేఅవుట్లలో 60 శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. వినియోగించే భూమిలో 90 శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. ఇందుకు గానూ హుడా బాధ్యత వహించాలి. రసాయనాలు, క్రిమిసంహారకాల స్థాయిలు లెక్కించేందుకు ప్రత్యేక ఏజెన్సీతో పర్యవేక్షించాలి. జీ+2కి మించి నిర్మాణాలకు అనుమతి లేదు.

111 జీవో పరిధిలో 84 గ్రామాల్లో ఆంక్షల ఎత్తివేత..
111 జీవో పరిధిలోకి వచ్చే మండలాలు, గ్రామాల వివరాల్లోకి వెళితే.. మొయినాబాద్ మండలంలో 20 గ్రామాలు, శంషాబాద్ మండలంలో 47 గ్రామలు, సాబాద్ లో 2, కొత్తూరులో 1, రాజేంద్రనగర్ లో 3, శంకర్ పల్లిల్లో 3, చేవెళ్ల మండలంలో 6 గ్రామాలు, రాజేంద్రనగర్ లో 2 గ్రామాలు ఉండనున్నాయి. కాగా, 111 జీవో ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంపై సీఎం కేసీఆర్కు మంత్రి సబిత ఇంద్రారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. 69 జీవో వల్ల 84 గ్రామాల ప్రజలకు శాశ్వత విముక్తి దొరికిందని స్పష్టం చేశారు. జంట జలాశయాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకున్నారని.. సీఎస్ నేతృత్వంలో కమిటీ వేయడం శుభ పరిణామమని హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు జిల్లా ప్రజల తరఫున మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

జీవో 111.. జంట జలాశయాల పరిస్థితి ఏంటి?
ఇది ఇలావుండగా, జంట జలాశయాలు హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలు తీర్చేవి. ప్రస్తుతం కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో జంట జలాశయాలపై ఆధారపడటం పూర్తిగా తగ్గిపోయిందని టీఆర్ఎస్ సర్కారు, స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో జీవో 111 ఎత్తివేయడం లేదా పరిధి కుదించాలని కొన్నేళ్లుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ జీవోపై అధ్యయనం చేసేందుకు 2016లో తెలంగాణ ప్రభుత్వం హైపర్ కమిటీని నియమించింది. అయితే, జీవో ఎత్తివేతకు వ్యతిరేకంగా పలువురు పర్యావరణవేత్తలు న్యాయస్థానాలను ఆశ్రయించారు. జీవోపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై గత సెప్టెంబర్ నెలలో సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్షించారు. జలాశయాలను పరిరక్షిస్తూ పర్యావరణ ఇబ్బంది లేకుండా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే తాజా షరతులతో జీవో 111 పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికీ 111 జీవో ఎత్తివేత అంశంపై పర్యావరణ వేత్తలు తమ పోరాటాన్ని కొనసాగిస్తుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications