ఉద్యోగుల బదిలీల మార్గదర్శకాలు జారీ - ఇదీ షెడ్యూల్..!!
ఉద్యోగుల బదిలీల పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గతంలో ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. బదిలీ ప్రక్రియను ఈ నెల 5వ తేదీన ప్రారంభించి, 20వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీచేశారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. తిరిగి జూలై 21వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమలవుతుందని ఉత్తర్వుల్లో స్ఫష్టం చేసారు.
మార్గదర్శకాలు జారీ
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల పైన కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. 15 రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. జూన్ 30 నాటికి ఒకేచోట కనీసం రెం డేండ్ల సర్వీస్ పూర్తి చేసినవారు మా త్రమే బదిలీకి అర్హులుగా పేర్కొంది. స్పౌజ్ కేసులకు మాత్రం ఈ నిబంధన మినహాయింపు ఇచ్చింది. ఒకేచోట నాలుగేండ్లకు మించి పనిచేసిన ప్రతి ఒక్కరినీ బదిలీ చేయాలని ఆదేశించింది. దీనికి సమరో ఏడాదిలో (20 25 జూన్ 30) పదవీ విరమణ చేయబోయేవారికి మాత్రం సడలింపు ఇచ్చింది. అయితే వారు కోరుకుంటే మాత్రం బదిలీ చేయవచ్చని తెలిపింది. ఏ క్యాడర్‌లోనూ 40 శాతం మందికి మించి సిబ్బందిని బదిలీ చేయవద్దని స్పష్టం చేసింది.

ప్రాధాన్యతల పై స్పష్టత
ఒక స్థానాన్ని ఒకరికంటే ఎక్కువ మంది ఉద్యోగులు కోరుకుంటే ఈ క్రమంలో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. స్పౌజ్ కేసులు, 2025 జూన్ 30వ తేదీలోగా రిటైర్ అయ్యేవారు, 70 శాతం వైకల్యం కలిగిన ఉద్యోగులు, బుద్ధిమాంద్యం కలిగిన చిన్నారుల తల్లిదండ్రులు, వితంతువులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు, కఠిన ప్రదేశాల్లో (మారుమూల, గిరిజన ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతా లు వంటివి) దీర్ఘకాలంగా పనిచేస్తున్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నది. వ్యక్తిగత, వైద్య కారణాల బదిలీలను హెచ్‌వోడీలు నిశితంగా పరిశీలించాలి. ప్రభుత్వానికి నివేదిక అందించాలి. అన్ని విభాగాల్లో, అన్ని క్యాడర్ల ఉద్యోగులకు బదిలీలు వర్తిస్తాయి.
షెడ్యూల్ ఇలా
బదిలీ షెడ్యూల్ ను ప్రభుత్వం ప్రకటించింది. జూలై 5-8 మధ్య బదిలీలకు అర్హులు, ఖాళీల జాబితాను రూపొందించి ప్రకటించాలని షెడ్యూల్ ఖరారు చేసారు. జూలై 9-12 మధ్య ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు. జూలై 13-18 మధ్య దరఖాస్తుల పరిశీలన, జరుగుతుంది. మాస్టర్ లిస్ట్ రూపొందించాలని సూచించారు. జూలై 19-20 మధ్య బదిలీ ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. అక్కడి నుంచి మూడు రోజుల్లోగా రిలీవ్ చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. టీచర్లు, లెక్చరర్లు, ఆదాయాన్ని ఇచ్చే శాఖలు వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా, అటవీ, పోలీస్ విభాగాలకు సంబంధించి ఆయా శాఖలకు గతంలో ఉన్న ప్రత్యేక మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications