సంక్రాంతి కంటే ముందే.. రైతులకు రేవంత్ సర్కార్ అలెర్ట్!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు కీలక అలర్ట్ ను ఇచ్చింది. సంక్రాంతి పండుగ లోగా రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించింది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం సేకరణ మరో వారం రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో సంక్రాంతి తర్వాత కొనుగోలు కేంద్రాలను మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పండుగ ముగిసేలోపు ధాన్యం కొనుగోళ్ళు
ఈ ఖరీఫ్ సీజన్లో 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా లక్ష్యంలో 95 శాతానికి పైగా అంటే 69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. పండుగ ముగిసేలోపు మరో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మొత్తం ధాన్యం సేకరణ 71 లక్షల టన్నులకు చేరనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 8300 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
గత పది సంవత్సరాల ఖరీఫ్ చరిత్రలో ఇదే అత్యధిక ధాన్యం సేకరణగా నిలుస్తుందని వారు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కోసం గత అక్టోబర్ నెల నుంచి 8300 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సేకరించిన 69 లక్షల టన్నులలో, 37 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం, 32 లక్షల టన్నుల సన్న ధాన్యం ఉన్నాయి.
ఇంకా కొనసాగుతున్న ధాన్యం సేకరణ
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ వంటి జిల్లాలలో ఇంకా ధాన్యం సేకరణ జరుగుతుంది. మొత్తం 1800 కేంద్రాలలో ధాన్యాన్ని సేకరిస్తున్నారు. 13.70 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలలో 16వేల 942 కోట్ల రూపాయలను జమ చేశారు. ఇక ధాన్యం విక్రయించిన రెండు మూడు రోజుల్లోనే రైతులకు నేరుగా వారి ఖాతాలోకి డబ్బు జమ అవుతున్నాయి.
సన్న ధాన్యం అమ్మిన వారికి బోనస్
ఇదే సమయంలో సన్న ధాన్యం అమ్మిన రైతులకు కూడా ప్రభుత్వం బోనస్ ను చెల్లిస్తోంది. ఇప్పటివరకు 1850 కోట్ల రూపాయల బోనస్ చెల్లించవలసి ఉండగా, 924 కోట్ల రూపాయలను చెల్లించారు. ఈ ధాన్యం కొనుగోలు పూర్తయ్యేసరికి పెండింగ్లో ఉన్న బోనస్ చెల్లింపులను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.












Click it and Unblock the Notifications