రైతులకు గుడ్‌న్యూస్: రైతుబంధు నిధులు ఖాతాల్లో జమ, ఎన్ని కోట్లంటే?
హైదరాబాద్: తెలంగాణ రైతులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అందింది. రైతు బంధు పథకం కింద రాయితీ సాయం పంపిణీ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తొలిరోజు రైతుబంధు నిధులు రూ. 642.52 కోట్లు జమ అయ్యాయి. ఎకరాల వారీగా ప్రతి రోజు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగానే రైతుబంధు నిధులు జమ ప్రారంభం కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎకరాల వారీగా ప్రతిరోజు రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అందుతున్న సూచనలు పాటించాలన్నారు. రైతుబంధు నిధులు విడుదల చేయడం పట్ల సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

కాగా, రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు బంధు నిధులను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తొలిరోజు ఎకరాలోపున్న రైతులకు 642.52 కోట్ల రూపాయల నిధుల్ని రైతుబంధు కింద వారి ఖాతాల్లో జమ చేశారు. సుమారు 22లక్షల 55వేల 81మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.
మరోవైపు, రైతు బంధు నిధులు విడుదల కావడం పట్ల ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. మరోమారు రైతుబంధు పండగ ప్రారంభమైందని హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇవాళ్టి నుంచి రైతుబంధు ద్వారా లక్షలాది రైతులకు పంట పెట్టుబడి సాయం అందుతుందని తెలిపారు. రైతుల శ్రేయస్సే ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రాధాన్యమన్నారు.
రైతుల ఖాతాల్లో ఇవాళ రూ.645 కోట్ల 52 లక్షలు జమ చేసినట్లు హరీశ్ రావు తెలిపారు. ఎకరాలోపు భూమి ఉన్న 22లక్షల 55వేల 81 మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఇప్పటికే సాగు పనులు మొదలుపెట్టారు.












Click it and Unblock the Notifications