తెలంగాణలో కొత్తగా 57 కోర్టులు మంజూరు: బాలల కోసం ప్రత్యేకంగా
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 57 నూతన కోర్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగానే జరిగే నేరాల విచారణకు ప్రత్యేకంగా 10 కోర్టుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చింది. కొత్త కోర్సుల్లో సిబ్బంది నియామకానికి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించింది. ఇప్పుడున్న కోర్టుల్లోనూ సిబ్బంది నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి కేడర్లలో ఈ కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఆర్ తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులను పరిగణలోకి తీసుకుని కొత్త కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆర్థిక శాఖ ఆమోదంతో కొత్త కోర్టులను మంజూరు చేసింది. ఇందులో బాలలపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేకంగా పది కోర్టుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇచ్చింది. కొత్త కోర్టుల్లో సిబ్బంది నియామకానికి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది. లక్షల్లో కేసులు పెండింగ్ లో పడుతున్న నేపథ్యంలోనే కొత్త కోర్టుల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు మంజూరు కావటంపై భద్రాచలం పట్టణ బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. కోర్టును తీసుకువచ్చేందుకు కృషి చేసిన భద్రాచలంకు చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేశ్, జిల్లా జడ్జి పాటిల్ వసంత్, న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. అదనపు కోర్టుతో పెండింగ్ కేసులకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని స్థానికులు, న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications