సంచలనం: పింఛన్లు వెనక్కి తీసుకుంటున్న ప్రభుత్వం!
గతంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం అనర్హులకు కూడా పింఛన్లు మంజూరు చేసిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. పేద కుటుంబాలకు అందాల్సిన ఆసరా పింఛన్లు దుర్వినియోగం కావడంపై ముఖ్యమంత్రి సీరియస్ గా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు, కుటుంబ పింఛన్లు పొందుతున్నవారు కూడా ఆసరా కింద పింఛన్లు తీసుకుంటున్న ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది.
పింఛన్లు రికవరీ చేస్తున్నారు
రిటైర్మెంట్ పెన్షన్ తోపాటు ఆసరా పెన్షన్ కూడా తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 5650గా ఉంది. వీరిలో 3824 మంది మృతిచెందగా 1826 మంది మాత్రం రెండు పింఛన్లు తీసుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ విచారణలో తేలిన విషయాలనుబట్టి వారికి ఆసరా పింఛన్లు రద్దు చేయడంతోపాటు గతంలో మంజూరు చేసిన పింఛన్లద్వారా వచ్చిన సొమ్మును రికవరీ చేయాలని నిర్ణయించింది.

లబ్ధిదారుల జాబితా రూపొందిస్తున్నాం
తాజాగా రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి పైసా అర్హులకే దక్కాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని, పింఛన్ల పంపిణీలో అక్రమాలను అరికట్టి కొత్త లబ్ధిదారుల జాబితాను కొత్తగా రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ది మరోసారి తప్పులకు అవకాశం లేకుండా చూస్తామని, త్వరలోనే లబ్ధిదారులకు కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు సీతక్క వెల్లడించారు.
త్వరలోనే కొత్త పింఛన్లు
సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందే ఆర్థికంగా వెనకబడినవారి కోసమని, అర్హులైనవారికి అందకుండా ఇతరులు వీటిని అక్రమంగా పొందుతుంటే రాబోయే రోజుల్లో వారిపై కఠినచర్యలు తీసుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధమవుతోందని సీతక్క తెలిపారు. మానవీయ కోణంలో పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే అర్హులకు పింఛన్లు మంజూరు చేయనున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications